ఆదాయ చోదక శక్తుల్లో పర్యాటకం ప్రథమంగా ఉంటుంది. దేశీ.. విదేశీ పర్యాటకులు కలియతిరిగే ప్రాంతాల్లో ఉపాధికి ఢోకా ఉండదు. కరోనా జిల్లాలో పర్యాటకంపై పంజా విసిరింది. ఈ ఏడాది పర్యాటకులు గణనీయంగా తగ్గారు. కీలక మాసాల్లో సందర్శనీయ ప్రాంతాలు మూతబడి ఉండటంతో రాష్ట్ర పర్యాటక కార్పొరేషన్ రూ.కోట్లల్లో ఆదాయం కోల్పోయింది. స్థానికంగా పర్యాటకులతోనే ఉపాధి పొందేవారి జీవితాలపై కూడా ఇది పెనుప్రభావం చూపించింది. కరోనా అన్‌లాక్-4 మొదలైన వెంటనే పర్యాటక ప్రదేశాల సందర్శనకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది. దీంతో రాష్ట్ర పర్యాటక సంస్థ వెబ్‌సైట్ ద్వారా దర్శనీయ ప్రాంతాల సందర్శనకు గదుల బుకింగ్ ప్రారంభమైంది. ఆకర్షణీయ ప్యాకేజీల రూపకల్పన కూడా జరుగుతుంది.
జిల్లాలో విజయపురిసౌత్, ఉండవల్లి గుహలు, కాకాని పక్షుల కేంద్రం, భట్టిప్రోలు బౌద్ధ స్థూపాలు, అమరావతి మ్యూజియం, బుద్ధ విగ్రహం, అమరేశ్వరుని ఆలయం, సూర్యలంక తీరం దర్శనీయ ప్రాంతాలుగా ఉన్నాయి. వీటితోపాటు కోటప్పకొండ, కొండవీడు కోట, అమరావతి, చేజర్ల, కారంపూడి, మంగళగిరి, బాపట్ల, పొన్నూరులోని ఆలయాలు సందర్శనీయ ప్రదేశాలుగా ఉన్నాయి. కొవిడ్‌తో ఐదు నెలలపాటు ఇళ్లకే పరిమితమైన ప్రజలు ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి ఆహ్లాదం.. ఆధ్యాత్మికం.. ఆనందం కోసం తమ విలువైన సమయాన్ని వెచ్చిస్తున్నారు.
అన్ని పర్యాటక ప్రదేశాల సందర్శనకు అనుమతి
జిల్లాలో అన్ని పర్యాటక ప్రదేశాల సందర్శనకు తాజాగా అనుమతి ఇచ్చాం. పర్యాటకుల ఆరోగ్యం దృష్ట్యా శానిటైజ్‌తోపాటు నిరంతరం స్వచ్ఛంగా ఆ ప్రదేశాలను ఉంచుతాం. మాస్క్‌లు ధరించడంతోపాటు వ్యక్తిగత జాగ్రత్తలను పర్యాటకులు తీసుకోవాలి. పర్యాటక సంస్థకు ఆదాయం వచ్చే వాటితోపాటు రాని దేవాలయాలు, హోటళ్లకు కోట్ల సంఖ్యలో ప్రజలు ఏటా వస్తుంటారు. అలాంటి వారందరూ ఈ ఏడాది గణనీయంగా తగ్గారు. సాధారణ పరిస్థితులు నెలకొంటే మళ్లీ పర్యాటక రంగానికి పూర్వ వైభవం వచ్చే అవకాశాలున్నాయి.
- జి.నాయుడమ్మ, జిల్లా టూరిజం అధికారి
--
ఇదీ చూడండి: