గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ప్రసూతి, కాన్పుల వార్డుల్లో పరిస్థితి దారుణంగా తాయారైంది. ఒక్కో పడకపై ఇద్దరేసి రోగులను ఉంచి సేవలు అందించాల్సి వస్తోంది. రోగులకు సహాయకులుగా వచ్చే వారికి నిలువ నీడ ఉండటం లేదు. ఈ సమస్యలను అధిగమించడానికి గత ప్రభుత్వ హయాంలో కొన్ని, వైకాపా ప్రభుత్వం వచ్చాక మరికొన్ని నిర్మాణ పనులును ఏపీ వైద్య, మౌలిక సదుపాయాల సంస్థ(ఏపీఎంఎస్‌ఐడీసీ) యంత్రాంగం చేపట్టింది. ప్రభుత్వం, దాతల భాగస్వామ్యంతో ఆయా పనులు ప్రారంభించారు. వీటిల్లో కొన్ని తుది దశకు చేరుకోగా మరికొన్ని ఆరంభంలోనే ఉన్నాయి. సుమారు మూడేళ్ల కిందట చేపట్టిన పనులు అసంపూర్తిగానే ఉన్నాయి.
కరోనా నేపథ్యంలో ఆరేడు, మాసాల నుంచి పొదిలి ప్రసాద్ మిలీనియం బ్లాకు నుంచే అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నారు. దీంతో ఇక్కడే కొవిడ్ రోగులు, సాధారణ రోగులు వారి బంధుగణం అంతా కలియతిరుగుతున్నారు. ప్రధానంగా ప్రసూతి సేవల కోసం వచ్చే మహిళలు ఈ కారణంగా నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్న ఎన్జీవో ఉద్యోగుల సంఘం చేపట్టిన భవనాన్ని త్వరగా పూర్తి చేసి ఆ భవంనలో రోగి అటెండర్లను ఉంచాలని సూచిస్తే కొంత వరకు బ్లాకు వద్ద రద్దీ తగ్గనుంది.
ఇటీవల కురిసన వర్షాలకు మాతా-శిశు సంరక్షణ బ్లాకులో ఆరేడు అడుగుల మేర నీళ్లు చేరాయి. వాటిని మోటార్లతో బయటకు తోడాల్సిన అవసరం ఉంది. నీళ్లు బాగా చేరడంతో ఇప్పట్లో పనులు చేపట్టలేని పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా పనులు ప్రణాళికబద్ధంగా సాగటం లేదు. మరోవైపు తమకు బిల్లు బకాయిలు చెల్లిస్తేనే పనులు చేపడతామని గుత్తేదారులు అంటున్నారు. ఈ ఏడాది జూన్ 8న రూ.5.53 కోట్ల బిల్లు ప్రతిపాదించగా ఇప్పటి వరకు అది చెల్లింపునకు నోచుకోలేదు.
నిధుల సమస్యలతో నిర్మాణ పనులు నిలిచాయి. గుత్తేదారులకు చెల్లింపులు చేసి త్వరగా పనులు పూర్తి చేయాలని ఇటీవల నిర్ణయం తీసుకున్నామని.. జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి చెప్పారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఇదీ చదవండి: జగన్ కేసులపై నేడు విచారణ