గుంటూరు జిల్లా పొత్తూరు గ్రామానికి చెందిన ఆళ్ల బొల్లయ్య (44) అనే వ్యక్తి తన అత్తగారి గ్రామమైన కారంకివారి పాలెం వచ్చి కాలువగట్టుపై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళగిరి ఆర్టీసీ డిపోలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న బొల్లయ్య తన రెండెకరాల పొలం అమ్మేందుకు బేరం పెట్టాడు. మధ్యవర్తుల ద్వారా ప్రస్తుత మందడం ఇంటెలిజెన్స్ సీఐ చంద్రమౌళి బినామీ పేరు మీద పొలం కొనేందుకు ముందుకొచ్చారు. కొంత నగదు ఇచ్చి మిగిలిన మెుత్తం తమ పొలాన్ని వ్యాపార నిమిత్తం బ్యాంకు లోన్ తీసుకుని చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అందుకు బొలయ్య అంగీకరించడంతో సిఐ చంద్రమౌళి అతని బినామీలు 3 కోట్ల రూపాయలు విజయవాడలో హోటల్ వ్యాపారం ప్రారంభించేందుకు తీసుకున్నారు.
అయితే రెండు సంవత్సరాలు గడచినా పొలం డబ్బులు ఇవ్వకపోవడంతో బొల్లయ్య... సీఐపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. అయినా ఫలితం లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై...మరో వైపు ఉన్న అప్పుల బాధలు తాళలేక అత్తారింటికి వచ్చి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎకరం పొలం 75 లక్షల చొప్పున రెండు ఎకరాలు కొనుగోలు చేసేందుకు అంగీకరించిన సీఐ ఇప్పటి వరకు 45 లక్షలు చెల్లించి..అడుగుతుంటే సమాధానం ఇవ్వడం లేదని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. సిఐ తన వ్యాపారం కోసం ఆర్ధిక ఇబ్బందులకు గురి చేశాడని..ఆ కారణంతోనే బొల్లయ్య మృతి చెందాడని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని...మరణానికి కారణమైన వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని నగరం మండల పొలీస్ స్టేషన్ లో మృతుడి బంధువులు ఫిర్యాదు చేశారు.