NOTICES TO COMMERCIAL TAX ASSOCIATION : రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించి.. ఉద్యోగుల క్రమశిక్షణ నిబంధనలు ఉల్లంఘించినందున ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఏపీ కమర్షియల్ టాక్స్ సర్వీసెస్ అసోసియేషన్‌కు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఇంఛార్జి ప్రధాన కమిషనర్ ఎన్.గుల్జార్ సంజాయిషీ నోటీసు జారీచేశారు. ఉన్నతాధికారి విధుల నిర్వహణకు అవరోధం కలిగించడంవంటి చర్యలకు పాల్పడడం క్షమించరాని వ్యవహారమని వ్యాఖ్యానించారు.మరోసారి ఇలా జరిగితే... సంఘం గుర్తింపు రద్దు చేయడమే కాకుండా పోలీసుల దృష్టికి కూడా తీసుకుపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ నోటీసును సంఘాధ్యక్షుడికి పంపారు.
సాధారణ బదిలీల అనంతరం ‘సవరణ’ పేరుతో పలువురికి బదిలీలు ప్రత్యేకంగా జరిగాయి. వీటి ఉత్తర్వుల జారీలో అవకతవకలు జరిగాయని ప్రభుత్వానికి ఫిర్యాదులందాయి. దీంతో గుల్జార్ ఈ ప్రత్యేక బదిలీల ఉత్తర్వులు రద్దుచేశారు. సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు గుంటూరు, విజయవాడ నోడల్ డివిజనుల్లో ఈ ప్రత్యేక బదిలీలకు దారితీసిన కారణాలపై విచారణ జరపాలని అదనపు కమిషనర్ ఎస్.ఈ.కృష్ణమోహన్‌రెడ్డిని గుల్జార్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 27న ఏపీసీటీ అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణ నేతృత్వంలో పలువురు ఆఫీస్ బేర్లర్లు విచారణ నివేదికలోని అంశాలు బహిర్గతం చేయాలని విచారణాధికారి కృష్ణమోహన్‌రెడ్డి ఛాంబరులో ధర్నా నిర్వహించడమే కాకుండా ప్రభుత్వ విధానాలు నిరసిస్తూ నినాదాలు చేశారు.
ఈ పరిణామాలపై కృష్ణమోహన్‌రెడ్డి నుంచి అందిన నివేదిక ప్రకారం.. సంఘం నుంచి వివరణ కోరుతూ గుల్జార్ గురువారం సంజాయిషీ నోటీసు జారీచేశారు. ‘అధికారుల విధులను అడ్డుకునే చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. సాధారణ బదిలీల నిర్వహణ సమయంలోనూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇలాంటి చర్యల కారణంగా సంఘం గుర్తింపును రద్దు చేయొచ్చు. అలాగే ఈ వ్యవహారాన్ని అధీకృత అధికారి దృష్టికి తగిన ఆధారాలతో ఎందుకు తీసుకుపోకూడదో వివరణ ఇవ్వాలి’ అని స్పష్టంచేశారు.
ఇవీ చదవండి: