ఎన్నికల నియమావళి తూ.చా తప్పకుండా పాటించాలని.. సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ వివేక్ యాదవ్ సూచించారు. ఇప్పటికే బ్యాలెట్ పత్రాల ముద్రణ, ఎన్నికల సామగ్రి సమీకరణ పూర్తయ్యిందని తెలిపారు. ఎన్నికల ప్రచారాలు కొవిడ్ జాగ్రత్తలను అనుసరించి జరిగేలా చూడాలన్నారు. శాంతి భద్రతలపరంగా సమస్యలు తలెత్తకుండా.. గ్రామాల్లో గొడవలు జరగకుండా చూడాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ సమావేశంలో గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి, రూరల్ ఎస్సీ విశాల్ గున్నీ పాల్గొన్నారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో వెబకాస్టింగ్...కలెక్టర్ వివేక్‌యాదవ్
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వివేక్‌యాదవ్ పేర్కొన్నారు. ఇప్పటికే బ్యాలెట్ పేపర్లు ముద్రితమయ్యాయన్నారు. జిల్లాలో 2,470 పోలింగ్ కేంద్రాలను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. 8వ తేదీన పోలింగ్ జరుగుతుందని, అనంతరం ఎక్కడైనా రీపోలింగ్ పరిస్థితి వస్తే 9న నిర్వహిస్తామన్నారు. 10న ఓట్ల లెక్కింపును మండల కేంద్రాల్లో అనుకూలమైన ప్రాంతాన్ని ఎంపిక చేసి అక్కడ నిర్వహిస్తామన్నారు. ఒక్కొక్క ఎంపీటీసీ స్థానానికి ఒక్కొక్క టేబుల్‌ను ఏర్పాటు చేసి త్వరితగతిన లెక్కింపు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది అందరికి వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నామని, పోటీలో ఉండి ప్రచారం చేస్తున్న అభ్యర్థులు కొవిడ్ నిబంధనలను పాటించాలని కలెక్టర్ చెప్పారు.
ఇదీ చదవండి: పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టులో జనసేన పిటిషన్