సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. కౌలు రైతులకు రుణాల మంజూరుకు బ్యాంకులు ముందుకు రావాలని సీఎం జగన్ సూచించారు. ప్రస్తుతం ఇస్తున్న రుణాలు ఆశాజనకంగా లేవని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్ నవోదయం కింద ఎంఎస్‌ఎంఈలకు, ప్రధాని ముద్రా యోజన కింద ఇచ్చే రుణాలు చాలా తక్కువగా ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు.
మహిళలకు ఇచ్చే రుణాల వడ్డీ రేట్ల విషయంలో బ్యాంకర్లు మానవతా దృక్పథంతో ఉండాలని సీఎం అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కేటగిరీ ఒకటిలో ఉన్న 6 జిల్లాల్లో ఒకలా, మిగిలిన 7 జిల్లాలో ఇంకోలా వడ్డీరేట్లు ఉన్నాయన్నారు. బ్యాంకులు వసూలు చేస్తున్న వడ్డీరేట్లు చాలా ఎక్కువగా ఉంటున్నాయని, 12.5 శాతం, 13.5 శాతం ఇలా వసూలు చేసుకుంటూ పోతున్నారని సీఎం అన్నారు. ప్రభుత్వం తరఫున సున్నా వడ్డీకే రుణాలు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో బ్యాంకులు ఈ స్థాయిలో వడ్డీలు వేయడం శోచనీయమని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: భారత్కు పయనమైన తెలుగు విద్యార్థులు