దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అనుసరించాల్సిన మార్గాలు సహా... రాష్ట్రాల్లో సౌకర్యాలు, వైద్యులకు శిక్షణ వంటి అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీతో మాట్లాడారు. రెండున్నర గంటలపాటు ప్రధాని మోదీ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచనలు చేశారు.
చర్చించిన విషయాలివే...
కరోనా వ్యాప్తి కట్టడికి కేంద్రం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందని ప్రధాని హామీ ఇచ్చినట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని వివరించారు. వ్యాప్తి నిరోధానికి చర్యలను వేగవంతం చేయాల్సిందిగా ప్రధాని సూచించారని వెల్లడించారు. నిర్ధారణ పరీక్షా కేంద్రాల ఏర్పాటుకు సహకరించాలని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడిగినట్టు చెప్పారు. విదేశీ విమాన సర్వీసుల నిలిపివేతను మరికొంతకాలం పొడిగించాలనీ కోరినట్టు వెల్లడించారు.
అంతకుముందు సీఎం జగన్ అన్ని జిల్లాల కలెక్టర్లతోనూ మాట్లాడి వివిధ రకాల సూచనలు చేశారని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా బులెటిన్‌ను మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. ఇప్పటివరకూ 128 నమూనాలు పంపిస్తే... వాటిల్లో 108 నమూనాలు నెగిటివ్‌గా వచ్చాయని చెప్పారు. మిగిలిన వాటి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. జనతా కర్ఫ్యూ గురించి కూడా రాష్ట్రాల సహకారాన్ని ప్రధాని కోరారని... దీనిపై కార్యాచరణ చేపడతామని మంత్రి వెల్లడించారు.
ఇదీ చదవండి:ప్రధాని మోదీ సూచనలను పాటించండి: పవన్