పొరుగు రాష్ట్రాల్లో ఉన్నవారు రాష్ట్ర సరిహద్దుల్లోకి వచ్చి ఇబ్బందులు పడొద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర హోం మంత్రిత్వశాఖ మార్గదర్శకాల ప్రకారం సొంత ప్రాంతాలకు వచ్చేందుకు వలస కూలీలకే అనుమతి ఉందని, ఇలాంటివారు వేలల్లో ఉన్నారని తెలిపింది. వీరందరినీ క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచటంతో పాటు రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని వివరించింది. వీరికి సదుపాయాల కల్పన కష్టమవుతోందని.. అందుకే మిగతావారు సహకరించాలని కోరింది. కరోనా నియంత్రణ చర్యలపై సీఎం జగన్ ఆదివారం సమీక్షించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ‘కరోనా దృష్ట్యా ఎక్కడివారు అక్కడే ఉండటం క్షేమకరం. ప్రయాణాల వల్ల వైరస్ వ్యాప్తిచెందే అవకాశాలు ఎక్కువ. పెద్దవాళ్ల ఆరోగ్యానికి ముప్పు ఉంటుంది. ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతున్న కరోనా నియంత్రణ చర్యలకు ప్రజల సహకారం కావాలి. కరోనాపై పోరాటంలో మీ స్ఫూర్తి ప్రశంసనీయం. ప్రభుత్వ సూచనలను ఎప్పటికప్పుడు పాటించాలి’ అని జగన్ పేర్కొన్నారు. ఆయన ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..
సదుపాయాల కల్పన ముమ్మరం చేయాలి
విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వలస కూలీలు, ఇతరుల కోసం క్వారంటైన్ సదుపాయాల కల్పన ముమ్మరం చేయాలి. భోజన ఏర్పాట్లు, పడకలు, ద]ుప్పట్లు, మరుగుదొడ్ల వంటివన్నీ యుద్ధప్రాతిపదికన సిద్ధం చేసుకోవాలి. జనాభా, అవసరాలకు అనుగుణంగా ఈ ఏర్పాట్లు చేసుకోవాలి. అవసరమైన మార్గదర్శకాలను త్వరగా విడుదల చేయాలి. రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నవారిని ప్రత్యేక రైళ్లలో పంపించాలి. ఇతర రాష్ట్రాల కూలీలను పంపేటప్పుడు వారికి పండ్లతో కూడిన ఒక కిట్ ఇవ్వాలి. ఖర్చులన్నీ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. మన రాష్ట్రంలో ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వలస కూలీలను బస్సుల్లో పంపించాలి.
రోజుకు మూడుసార్లు ఫోన్ చేయాలి
టెలి మెడిసిన్‌కు మిస్డ్‌కాల్ ఇచ్చిన వ్యక్తికి ఫోన్ చేసినప్పుడు కాలర్ అందుబాటులోకి రాకపోతే రోజుకు మూడుసార్లు చొప్పున మూడు రోజులు కాల్ చేయాలి. ఆ తర్వాతే కాలర్ అందుబాటులో లేడని గుర్తించాలి. టెలి మెడిసిన్‌లో ప్రిస్క్రిప్షన్ ఇచ్చినవారికి మందులు నేరుగా పంపిణీ చేయాలి. దీనికోసం ద్విచక్ర వాహనాలు, థర్మల్ బాక్సు ఏర్పాటు చేసుకోవాలి. గ్రామస్థాయిలో ఆరోగ్య ఉపకేంద్రాల నిర్మాణం వేగంగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆరోగ్య ఉప కేంద్రాలు ప్రారంభమైన తర్వాత నేరుగా అక్కడే మందులు సహా ప్రథమ చికిత్స అందుబాటులో ఉంటుంది.
కంటెయిన్‌మెంట్ జోన్ల వెలుపల పెద్దగా కేసులు లేవు
రాష్ట్రంలో కంటెయిన్‌మెంట్ జోన్ల వెలుపల పెద్దగా కేసులు లేవని అధికారులు సీఎంకు వివరించారు. సర్వేలో గుర్తించిన వారికి ముమ్మరంగా పరీక్షలు చేయిస్తున్నామని, 32,792 మందిలో ఇప్పటివరకూ 23,639 మందికి పరీక్షలు నిర్వహించామని, మిగతా వారికి రెండు రోజుల్లో పూర్తవుతాయని వివరించారు.
ఇదీ చదవండి