అచ్చెన్నాయుడు అరెస్టు వెనుక ముఖ్యమంత్రి జగన్ ఉన్నారని తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. అందువల్లే పోలీసు వ్యవస్థ సైతం చట్ట వ్యతిరేకంగా వ్యహరిస్తోందని విమర్శించారు. అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే శక్తి లేనందునే ప్రభుత్వం కక్షపూరితంగా అరెస్టులకు పాల్పడుతోందని అన్నారు. గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడును చూసేందుకు ఎంపీ రామ్మోహన్ నాయుడు వెళ్లారు. అయితే పోలీసులు ఆయనను అనుమతించలేదు. అనంతరం జీజీహెచ్ వద్ద మీడియాతో రామ్మోహన్ నాయుడు మాట్లాడారు.
'అచ్చెన్నాయుడిని టెర్రరిస్టు మాదిరిగా అరెస్టు చేశారు. అరెస్టుకు సహకరిస్తామని చెప్పినా దారుణంగా ప్రవర్తించారు. శస్త్రచికిత్స జరిగిందని తెలిసీ పథకం ప్రకారం అరెస్టు చేశారు. బలమైన గొంతును నొక్కేయాలనే కక్షతోనే ఇదంతా చేశారు. 6సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి పట్ల ఇలాంటి వైఖరి సరికాదు. అనుమానం ఉంటే నోటీసు ఇచ్చి విచారణ చేపట్టాలి. ఈఎస్‌ఐ విషయంలో అచ్చెన్నాయుడు ఎప్పుడో స్పష్టత ఇచ్చారు. వైకాపా ప్రభుత్వ మాట వినకున్నా.. ఎదురు తిరిగినా కేసులు పెడుతున్నారు. ఎంతలా బెదిరించినా భయపడం, రాజీపడం. దీనిపై న్యాయపోరాటం చేస్తాం' అని ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.