ఆగస్టు నుంచి పల్లె బాట పట్టాలని భావిస్తున్న ముఖ్యమంత్రి జగన్... నియోజకవర్గాల్లో పెండింగ్ సమస్యలపై ముందుగానే ఆరా తీస్తున్నారు. వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలకు రోజుకు కొందరికి చొప్పున సీఎం జగన్ అపాయింట్మెంట్లు ఇస్తున్నారు. వారి నియోజకవర్గాల్లో పెండింగ్ పనులు, ఎన్నికల హామీలు, కొత్తగా చేపట్టాల్సిన పనులపై ఆయన చర్చిస్తున్నట్లు సీఎంను కలిసిన ఎమ్మెల్యేలు చెబుతున్నారు. స్థానిక రాజకీయ పరిస్థితులపై ఒకరిద్దరితో మాట్లాడుతున్నారంటున్నారు. మంగళవారం ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభధ్ర స్వామి(విజయనగరం), వై.సాయి ప్రసాద్ రెడ్డి(ఆదోని), వై.బాలనాగిరెడ్డి(మంత్రాలయం), ఎస్టీ నియోజకవర్గ శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి పాములు పుష్ప శ్రీవాణి, కళావతి(పాలకొండ), భాగ్యలక్ష్మీ(పాడేరు) ధనలక్ష్మి(రంప చోడవరం) ముఖ్యమంత్రిని క్యాంపు కార్యాలయంలో కలిశారు.
ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి విజ్ఞప్తి మేరకు.. ఆదోనికి ప్రభుత్వ వైద్య కళాశాల, ఎమ్మిగనూరు- ఆలూరు బైపాస్కు సంబంధించి మిగిలిపోయిన 25 శాతం పనుల పూర్తికి, ఆదోని పట్టణంలో రహదారుల విస్తరణ పనులకు ముఖ్యమంత్రి అనుమతి ఇచ్చినట్లు సమాచారం. రాజోలి బండ కుడికాలువ నిర్మాణానికి మంత్రాలయం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి ప్రతిపాదించగా సీఎం సానుకూలంగా స్పందించారని తెలిసింది. విజయనగరంలో లక్ష ఇళ్ల పట్టాలకు సంబంధించి లే అవుట్ల ఏర్పాటు అంశం, రహదారుల నిర్మాణ పనులపై ఎమ్మెల్యే వీరభద్ర స్వామి సీఎం జగన్తో చర్చించినట్లు తెలిసింది. ఎస్టీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలతోనూ ఆయా నియోజక వర్గాల పరిస్థితిపై మాట్లాడారు. ఇవాళ కూడా పలువురు ఎమ్మెల్యేలకు సీఎం అపాయింట్మెంట్ ఇచ్చారు.
ఇదీ చదవండి