TDP leader Chintakayala Vijay: భారతి పే పేరుతో సామాజిక మాధ్యమాల్లో పోస్టుల వ్యవహారంలో తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌ని సీఐడీ అధికారులు రెండోసారి విచారించారు. ఇవాళ ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకూ విచారణ సాగింది. విచారణ అనంతరం విజయ్ మీడియాతో మాట్లాడారు. తాను గతంలో విచారణకు హాజరైన సమయంలో సీఐడీ అధికారులు 68 ప్రశ్నలు అడిగారని.. ఇవాళ 42 ప్రశ్నలతో సరిపెట్టారన్నారని విజయ్ వెల్లడించారు. వారడిగిన అన్నింటికీ సమాధానాలు చెప్పినట్లు తెలిపారు.
ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో కూడా విచారణ జరుగుతోందన్నారు. గతంలో విచారణ సందర్భంగా చంద్రబాబు, లోకేశ్‌కు సంబంధించిన అంశాలు ఎక్కువగా అడిగారని... తాను అభ్యంతరం వ్యక్తం చేయటంతో ఈసారి కేవలం ఫిర్యాదు ఆధారంగా మాత్రమే ప్రశ్నించారని వివరించారు. సీఐడీ అధికారులు నమోదు చేస్తున్న కేసుల్లో ఎఫ్.ఐ.ఆర్ బయటపెట్టకపోవటాన్ని విజయ్ తరపు న్యాయవాది తప్పుబట్టారు.
అయ్యన్నపాత్రుడు: ముఖ్యమంత్రి సైకో పాలనను విమర్శించిన వారిపై సీఐడీ కేసులు పెట్టి వేధిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. చింతకాయల విజయ్ సీఐడీ విచారణ ముగిసిన తర్వాత గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం తప్పులు చేస్తుంటే వాటిని ఎత్తిచూపటం విపక్షాల విధి అని స్పష్టం చేశారు. ఆ మాత్రం దానికే కేసులు పెట్టి అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు.
'గతంలో పోలీసులు నన్ను 68 ప్రశ్నలు అడిగారు, నేడు 42 ప్రశ్నలు అడిగారు. ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్పాను. పోలీసులు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. సోషల్ మీడియాలో కనపడ్డ అంశాలపై మేము సైతం పోలీసులకు సమాచారం ఇచ్చాం. వాటిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రానున్న రోజుల్లో కోర్టులో వాదనలు జరుగుతాయి. నాకు 41నోటీసులు ఇవ్వలేదు. ఇప్పటివరకు జరిగిన విచారణను వాళ్లు కోర్టుకు తెలుపుతామన్నారు.'- చింతకాయల విజయ్, తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఇవీ చదవండి: