నిజాయతీగా ఆదాయపు పన్ను చెల్లించేవారు చట్టాలకు భయపడక్కర్లేదని, ప్రతి ఒక్కరూ ఆదాయానికి అనుగుణంగా పన్ను చెల్లించాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ సూచించారు. సులభంగా, వేగంగా, ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో ఆదాయపు పన్ను చెల్లించేలా సేవలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ఆదాయపు పన్ను చెల్లింపుల్లో భారీ మార్పులు వచ్చాయని తెలిపారు. విజయవాడ, గుంటూరు ఐ.టి. కమిషనర్ల పరిధిలో 159వ ఆదాయపు పన్ను దినోత్సవాన్ని బుధవారం మంగళగిరిలోని హ్యాపీ రిసార్ట్స్‌లో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జస్టిస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పన్ను చెల్లించడం ద్వారానే దేశాభివృద్ధి జరుగుతుందన్నారు.
దేశంలో ఐ.టి. చెల్లింపుదారులు 7.5 కోట్లు
ఆదాయపు పన్ను శాఖ గుంటూరు ప్రిన్సిపల్ కమిషనరు రమేష్‌చంద్ మాట్లాడుతూ 1860 జులై 24న జేమ్స్ విల్సన్ భారతదేశంలో ఆదాయపు పన్నును ప్రవేశపెట్టారని తెలిపారు. విజయవాడ ప్రిన్సిపల్ కమిషనరు భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఆదాయపు పన్ను విధానం మొదలు పెట్టిన తరవాత తొలి ఏడాది రూ.22 కోట్లు వసూలైందని, ఇప్పుడు దేశవ్యాప్తంగా 7.5 కోట్ల మంది ఐ.టి. చెల్లింపుదారులు ఉన్నారని చెప్పారు. ‘దేశ ఆర్థికాభివృద్ధిలో ఆదాయపు పన్ను పాత్ర’ అనే అంశంపై తొలుత గుంటూరు, విజయవాడ ఆదాయపు పన్ను అప్పీలేట్ కమిషనర్లు బీసీఎస్ నాయక్, కేఎస్ రాజేంద్రకుమార్‌ల అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. 40, 50 ఏళ్ల నుంచి ఆదాయపు పన్ను చెల్లిస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్తల్ని జస్టిస్ ప్రవీణ్‌కుమార్ సన్మానించారు.