CEO Letter to CBN: రాష్ట్ర ఓటర్ల జాబితాలో 5 లక్షల 64 వేల 819 మంది అనర్హులున్నట్లు గుర్తించి వారి పేర్లు తొలగించామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్ మీనా తెలిపారు. 14 లక్షల 48 మంది అనర్హుల పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయని, పలు రాజకీయ పక్షాల నుంచి ఫిర్యాదులు అందినట్లు వివరించారు. ఆ ఫిర్యాదులను పరిశీలించి అనర్హులైన వారి పేర్లే తొలగించినట్లు తెలిపారు. ఓట్ల అవకతవకలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు సీఈసీకి చేసిన ఫిర్యాదులకు లేఖ ద్వారా సీఈఓ ఈ విధంగా సమాధానం ఇచ్చారు.
టీడీపీ అధినేతకు లేఖ: రాష్ట్రంలోని ఓటర్ల జాబితాలో పెద్దఎత్తున అవకతవకలు చోటుచేసుకున్నాయంటూ, గత సంవత్సరం డిసెంబరు 23న తెలుగుదేశం ప్రతినిధులు దిల్లీ నుంచి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందానికి ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించి తీసుకున్న చర్యలను వివరిస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్ మీనా సోమవారం టీడీపీ అధినేత చంద్రబాబుకు లేఖ రాశారు.
ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి సమాధానంపై టీడీపీ ఆగ్రహం
కేసుల వివరాలు వెల్లడించిన సీఈవో : ప్రత్యేక సమగ్ర సవరణ-2024 ప్రక్రియలో భాగంగా వచ్చిన 17,976 దరఖాస్తులు మినహా మిగతావన్నీ పరిష్కరించామని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా గంపగుత్తగా ఫాం-7లు దరఖాస్తు చేసిన వారిపై కాకినాడ నగర నియోజకవర్గ పరిధిలో 13, పర్చూరు నియోజకవర్గ పరిధిలో 10 కేసులు నమోదు చేశామన్నారు. గుంటూరు పశ్చిమ, బనగానపల్లె, చంద్రగిరి నియోజకవర్గాల పరిధిలో ఒక్కో కేసు నమోదు చేసినట్లు వివరించారు.
50 మంది బూత్ స్థాయి అధికారుల సస్పెండ్: ఓటర్ల జాబితాకు సంబంధించి తీవ్ర ఉల్లంఘనలు చోటుచేసుకున్న చోట్ల బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నామన్న సీఈవో ముకేశ్‌కుమార్ మీనా ఇప్పటివరకు ఉరవకొండ నియోజకవర్గానికి సంబంధించి ఇద్దరు ఈఆర్‌వోలు, ప్రొద్దుటూరులో ఒక ఈఆర్‌వో, పర్చూరులో ఒక ఏఈఆర్‌వో, ఒక సీఐ, ముగ్గురు ఎస్సైలను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. యాబై మంది బూత్‌స్థాయి అధికారులను సస్పెండ్ చేశామన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి.. ముకేశ్‌కుమార్ మీనా
97 శాతం లోపాలను సరిదిద్దినట్లు వివరణ : చంద్రగిరి జాబితాలో ఇష్టానుసారంగా ఫొటోలు పెట్టిన 24 మంది బూత్‌స్థాయి అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. సున్నా డోర్ నంబర్ చిరునామాతో ఉన్న ఓట్లు, ఒకే డోర్ నంబర్ చిరునామాతో పది అంతకంటే ఎక్కువగా నమోదై ఉన్న ఓట్లకు సంబంధించి లోపాల్ని 97 శాతం మేర సరిదిద్దామన్నారు. ఒకే కుటుంబంలోని వ్యక్తుల పేర్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాల పరిధిలో నమోదై ఉంటే వాటిని సరి చేశామన్నారు.
రాజకీయ పార్టీల అభ్యంతరాలను పరిగణలోకి : విశాఖలో 26 వేలు, ఎన్టీఆర్ జిల్లాలో 2 లక్షలు27 వేల 906 ఓట్లు సరిదిద్దామన్నారు. జిల్లా ఎన్నికల అధికారి క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే పోలింగ్ కేంద్రాల మార్పు చేపట్టామన్నారు. రాజకీయ పార్టీల అభ్యంతరాలనూ పరిగణనలోకి తీసుకున్నామన్నారు. సూపర్‌వైజరీ స్థాయి అధికారులనే ప్రిసైడింగ్ అధికారులుగా నియమిస్తామన్న ముకేశ్‌కుమార్ మీనా, తప్పుడు పత్రాలతో పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటర్లుగా నమోదైన తిరుపతికి చెందిన విజయ, కార్పొరేటర్లు టి. మునిరత్నం రెడ్డి, ఎస్. కె. బాబుపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.