Jalshakti Permission To TG Projects: తెలంగాణలో గోదావరి నదిపై ప్రభుత్వం చేపట్టిన మూడు ప్రాజెక్టులు చిన్న కాళేశ్వరం, చౌటుపల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతల, ఛనాక - కోరాట ఆనకట్టకు కేంద్ర జలశక్తి శాఖ సాంకేతిక సలహా మండలి అనుమతులు లభించాయి. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ అధ్యక్షతన దిల్లీలో జరిగిన టీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. భూపాలపల్లి జిల్లాలో చిన్న కాళేశ్వరం ఎత్తిపోతలు, నిజామాబాద్ జిల్లాలో చౌటుపల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతలు, ఆదిలాబాద్ జిల్లాలో ఛనాకా-కోరాట ఆనకట్ట చేపట్టారు.
చిన్న కాళేశ్వరం ద్వారా నాలుగున్నర టీఎంసీల నీటిని ఎత్తిపోసి చెరువులను నింపి మహదేవ్ పూర్, కాటారం, మహాముత్తారం, మల్హర్ రావు మండలాలకు సాగు, తాగునీరు ఇవ్వాలన్నది లక్ష్యం. కమ్మర్ పల్లి, మోర్తాడ్, వైరా మండలాల్లోని 11వేల ఎకరాలకు సాగునీరు అందించేలా చౌటుపల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతలను చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లాలోని 13 వేల ఎకరాలకు తాగునీరు, 81 గ్రామాలకు తాగునీరు ఇచ్చేలా పెన్ గంగ నదిపై ఛనాకా - కోరాట ఆనకట్టను చేపట్టారు.
ఈ ప్రాజెక్టులపై.. ఏపీ లేవనెత్తిన అభ్యంతరాలపై మరోసారి సమీక్షించిన కేంద్ర జలసంఘం.. మూడు ప్రాజెక్టులకు సాంకేతిక, ఆర్థిక అనుమతులు ఇవ్వవచ్చని సిఫారసు చేస్తూ సలహా మండలికి పంపింది. ఈ సిఫారసులపై టీఏసీ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ భేటీలో సభ్యుల సందేహాలను తెలంగాణ ప్రతినిధులు నివృత్తి చేయగా... మూడు ప్రాజెక్టులకు ఆమోదం తెలుపనున్నట్లు టీఏసీ ఛైర్మన్ పంకజ్ కుమార్ ప్రకటించారు. త్వరలోనే... ఇందుకు సంబంధించిన మినిట్స్ జారీ చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ, కేంద్ర జలసంఘం అధికారులు, రాష్ట్ర నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్సీలు మురళీధర్, వెంకటేశ్వర్లుతో పాటు ఇంజనీర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇవీ చదవండి: