అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ 97వ రోజూ రాజధాని గ్రామాల్లో నిరసన హోరెత్తింది. లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఆందోళన కొనసాగించారు. శిబిరాల్లో కొద్దిమంది మాత్రమే నిరసన చేయగా... మిగిలిన వారు ఎవరి ఇంటి వద్ద వారు నిరసన ప్రకటించారు. సామాజిక దూరం పాటిస్తూ అమరావతిని కొనసాగించాలని కోరుతూ రైతులు, మహిళలు, చిన్నారులు నినాదాలు చేశారు.
హైకోర్టు తీర్పు పై రైతులు హర్షం...
50 ఏళ్ల లోపువారే నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని ఐకాస నిర్ణయించింది. రాజధానిలో కొత్తగా వెంకటపాలెంలో ధర్నా శిబిరం ప్రారంభమైంది. 97వ రోజూ తుళ్లూరు, మందడం, రాయపూడి, వెలగపూడి, కృష్ణాయపాలెం, యర్రబాలెం, వెంకటపాలెం, నీరుకొండ, పెదపరిమి గ్రామాల్లోనూ, తాడికొండ అడ్డరోడ్డు వద్ద ధర్నా చేసే రైతులు పొన్నేకల్లులోనూ ధర్నాలు చేపట్టారు. రాజధాని ప్రాంతంలో వేరే ప్రాంతాలవారికి ఇళ్ల స్థల పట్టాలు మంజూరు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 107పై హైకోర్టు స్టే విధించడంతో రాజధాని రైతులు, అమరావతి పరరిక్షణ సమితి ఐకాస నాయకుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి...గుంటూరులో 11 మందికి కరోనా లక్షణాలు