గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని ఓ తవుడు దుకాణంలో... ఓ బాలుడు అనుమానాస్పద మృతి.. స్థానికంగా చర్చనీయాంశమైంది. అతని శరీరంపై తీవ్ర గాయాలున్నాయి. అంతే కాక.. మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా స్వస్థలం చిలకలూరిపేట తరలించడంతో పాటు దుకాణ యజమాని పరారీలో ఉండటం... హత్య అన్న అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి.
చిలకలూరిపేట పట్టణంలోని 22వ వార్డు ఆవులదొడ్డి ప్రాంతానికి చెందిన దాణావతుల ప్రభు సంతోష్ (15).. చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయాడు. అన్నపురెడ్డి వీరమ్మ అనే మహిళ అతన్ని చేరదీసి పెంచింది. కూలి పనులకెళ్లే ఆ బాలుడిని వారం క్రితం స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి ద్వారా వినుకొండ శివారు మార్కాపురం రోడ్డులోని పశువుల దాణా దుకాణంలో పనికి పెట్టారు.
"భవనంపై పడుకుని మీ అబ్బాయి చనిపోయాడు" అని సంతోష్ బంధువులకు దుకాణంలో పనిచేసే ఇతర కుర్రాళ్లు ఫోన్ చేసి చెప్పడంతో వాళ్లు వెంటనే అక్కడకి వెళ్లి పరిశీలించారు. అప్పటికే దుకాణం తలుపులు వేసి మృతదేహాన్ని చిలకలూరిపేటకు ఆటోలో పంపించినట్లు చెప్పడంతో తిరిగి వెళ్లారు. అక్కడ ఎవరూ లేకుండా బంధువుల ఇంటి వద్ద మృతదేహాన్ని వదిలేసి రావడాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
బాలుని ఒంటిపై తీవ్ర గాయాలున్న కారణంగా... సంఘటనా స్థలానికి మృతదేహాన్ని తిరిగి తీసుకెళ్లాలని స్థానిక పోలీసుల సూచన మేరకు రాత్రికి తిరిగి వినుకొండ ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాన్ని ఉంచారు. దుకాణ యాజమాని వస్తే తప్ప మృతికి కారణాలు చెప్పలేమని హెడ్‌కానిస్టేబుల్ సాంబయ్య తెలిపారు.
ఇదీ చదవండి: