కరోనా వ్యాప్తి నియంత్రణలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని భాజపా, జనసేన అభిప్రాయపడ్డాయి. ఆదివారం రెండు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు ఆన్లైన్ ద్వారా వీడియో సమావేశం నిర్వహించారు. భాజపా తరఫున పార్టీ జాతీయ కార్యదర్శి సతీష్, సునీల్ దియోధర్, జీవీఎల్ నరసింహారావు, కన్నా లక్ష్మీనారాయణ, పురంధేశ్వరి, సోము వీర్రాజు... జనసేన నుంచి పార్టీ అధ్యక్షుడు పవన్కళ్యాణ్, రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఏపీలో కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోందని సమావేశంలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల సంఖ్య పెరిగినప్పటికీ వైరస్ వ్యాప్తిని నివారించటంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా పని చేయడం లేదని భాజపా జాతీయ కార్యదర్శి వి.సతీష్ ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది రక్షణలో సర్కారు వైఫల్యం ప్రస్ఫుటంగా కనిపిస్తోందని ఇరు పార్టీల అగ్రనాయకులు పేర్కొన్నారు. కరోనా నివారణలో ఎక్కడ లోటుపాట్లు ఉంటే అక్కడ ప్రజా పక్షాన నిలబడి పోరాటం చేయాలని రెండు పార్టీలు నిర్ణయించాయి.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా నిర్మించిన ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు లబ్ధిదారులకు ఇవ్వక పోవటంపై నేతలు అసంతృప్తి వెలిబుచ్చారు. ప్రధాని ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్.. రాష్ట్రంలో ఎలా అమలు అవుతుందో అధ్యయనం చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపట్టాలని తీర్మానించారు. త్వరలోనే మరోసారి సమావేశం నిర్వహించి పోరాట ఎజెండా ఖరారు చేయనున్నట్లు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఇదీ చదవండి