కృష్ణా జిల్లాలో
కరోనా మహమ్మారి నివారణకు ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కృష్ణా జిల్లా మైలవరం ఎస్సై శ్రీను విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉంటూ వైద్యాధికారుల సూచనలను పాటిస్తే కరోనా వ్యాప్తిని నిరోధించడం అసాధ్యం కాదని తెలిపారు.
కర్నూలు జిల్లాలో
ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఛైర్మన్ ఉమామహేశ్వరి, కార్యదర్శి ఉమాపతి రెడ్డి... ఏజెంట్లు, హమాలీలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మార్కెట్లో పని చేస్తున్న కార్మికులకు మాస్కులు, సబ్బులు, చేతిని శుభ్రం చేసుకునే ద్రావణాలను పంపిణీ చేశారు.
నెల్లూరు జిల్లాలో
కరోనా వైరస్ నుంచి కాపాడుకునేందుకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆత్మకూరు ఆర్టీసీ డిపోలో డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బందికి శానిటైజర్లు, మాస్కులు అందజేశారు. కరోనాపై పొగాకు రైతులకు వైద్యులు అవగాహన కల్పించారు.
విశాఖ జిల్లాలో
కరోనా వైరస్ పట్ల అందరు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు మాస్క్లు ధరించాలని ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా.పి.వి. సుధాకర్ 'ఈటీవీ భారత్' ముఖాముఖిలో తెలిపారు.
ప్రకాశం జిల్లాలో
కరోనా పట్ల అప్రమత్తంగా ఉండి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వైరస్ దరిచేరదని చీరాల డీఎస్పీ జయరామసుబ్బారెడ్డి చెప్పారు. చీరాల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో పోలీసులకు కరోనా వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. వైరస్ పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాలని... జాగ్రత్తలు పాటిస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎస్పీ ఆదేశించారు.
అనంతపురం జిల్లాలో
తాడిపత్రి పట్టణ పోలీసు స్టేషన్లో డీఎస్పీ ఆధ్వర్యంలో కరోనా వైరస్ నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వైరస్ సంక్రమించే పద్ధతుల గురించి పోలీసులకు వివరించారు. వైరస్ భారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. వివిధ సమస్యలపై పోలీసు స్టేషన్కు వచ్చే ప్రజలతో చేతులు శుభ్రం చేయించి మాస్కులు పంపిణీ చేశారు.
కడప జిల్లాలో
రైల్వే కోడూరు పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, కొరముట్ల శ్రీనివాసులు కరోనా వ్యాధిపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజలందరూ వైద్యులు, ప్రభుత్వం సూచించిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సమావేశాలకు దూరంగా ఉండాలని, కరచాలనం చేయకుండా ఉండాలని ప్రజలను కోరారు.
ఇదీ చదవండి: ప్రపంచంపై కరోనా పంజా.. 10వేలకు చేరిన మరణాలు