లాక్డౌన్తో తీవ్రంగా నష్టపోయిన ఆర్టీసీని.. గాడిలో పెట్టడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఆర్టీసీ లాక్డౌన్ అంక్షలు సడలించిన తర్వాత కూడా చాలా తక్కువ బస్సులను మాత్రమే నడుపుతోంది. అది కూడా సీట్ల సంఖ్య తగ్గటంతో కేవలం నిర్వహణ ఖర్చులకే సరిపోయే పరిస్థితి. ఇతర రాష్ట్రాలకు ఇంకా సర్వీసులు ప్రారంభం కాలేదు. కరోనా నుంచి తేరుకుని సానుకూల వాతావరణం ఏర్పడే పరిస్థితి ఇప్పట్లో కనిపించటం లేదు. ఆక్యుపెన్సీ 50శాతానికి మించి ఉండే అవకాశాలు తక్కువని అధికారులు అంచనాకు వచ్చారు. అందుకే సరకు రవాణాపై దృష్టి సారించారు.
ఆర్టీసిలో లాజిస్టిక్స్ విభాగం ఏర్పాటుకు అధికారుల చర్యలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ బస్సుల సీట్లు తొలగించి వెనక వైపు కంటైనర్ పెట్టాలని నిర్ణయించారు. అందులో సరకు రవాణా చేపట్టనున్నారు. నమూనా కోసం ఓ వాహనాన్ని కంటైనర్ తరహాలో మార్పులు చేశారు. ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ ఆ వాహనాన్ని పరిశీలించి..కొన్ని సూచనలు చేశారు. ఆర్టీసీ.. లాజిస్టిక్స్ కోసం సిద్ధమవుతున్నామంటూ ఫేస్ బుక్ పేజీలో సంబంధిత ఫొటోలు ఉంచింది.
ఇదీ చదవండి: 'ప్రయాణం వల్లే అచ్చెన్నకు గాయం పెరిగింది'