'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' ప్రారంభం, జాతీయ పతాకం రూపొందించి ఈ ఏడాది మార్చి 31కి వందేళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని.. భారత జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుమార్తెను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సత్కరించారు. గుంటూరు జిల్లా మాచర్లలో ఉంటున్న పింగళి కుమార్తె సీతామహాలక్ష్మి నివాసానికి వెళ్లిన సీఎం.. ఆమెకు శాలువా కప్పి జ్ఞాపిక బహూకరించారు.
99 ఏళ్ల సీతామహాలక్ష్మి యోగక్షేమాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. త్రివర్ణపతాకంతోపాటు పెద్ద ఛాయాచిత్రాన్ని అందించారు. పింగళి కుటుంబసభ్యులతో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. పింగళి జీవిత విశేషాలతో కూడిన చిత్ర ప్రదర్శనను తిలకించారు. సీతామహాలక్ష్మికి ముఖ్యమంత్రి 75లక్షల ఆర్థికసాయం ప్రకటించగా.. దీనిపై ప్రభుత్వ ఉత్తర్వులు వెలువరించింది.
సీఎం జగన్ తమ ఇంటికి రావడం పట్ల పింగళి కుమార్తె సీతామహాలక్ష్మి, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్యకు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలని ముఖ్యమంత్రి జగన్.. ప్రధాని మోదీకి లేఖ రాశారు. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లవుతున్న వేళ నిర్వహిస్తున్న 'ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని పురస్కరించుకుని.. పింగళికి భారతరత్న ప్రకటించడం సముచితమని లేఖలో పేర్కొన్నారు. వెంకయ్య రూపొందించిన జెండాను 1947 జులై 22న అధికారికంగా జాతీయ పతాకంగా అమోదించారని గుర్తుచేశారు.
పింగళి సేవలకు తగిన గుర్తింపు దక్కలేదని.. భారతరత్న పురస్కారంతో సమున్నతంగా గౌరవించాలని ముఖ్యమంత్రి జగన్ కోరారు. అరుణా ఆసఫ్ అలీ, భూపేంద్రకుమార్ హజారికా, నానాజీ దేశ్‌ముఖ్ లాంటి ప్రముఖులకు మరణానంతరం భారతరత్న ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' నిర్వహణ పట్ల ఏపీ ప్రజలు హర్షిస్తున్నారని.. వారిలో దేశభక్తి ఉప్పొంగుతోందని లేఖలో సీఎం పేర్కొన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఇంటిపైనా మువ్వన్నెల జెండా ఎగరవేయనున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండీ... కరోనా: ఏపీలో తొలి కేసు నమోదై నేటికి ఏడాది..!