APCC PRESIDENT GIDUGU FIRES ON YCP : అదానీ ఆర్థిక నేరాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ చేయించాలని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఛలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యత్నించాయని ఆయన ఆరోపించారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో గిడుగు రుద్రరాజు మాట్లాడారు. విశాఖలో నిర్వహించిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయని ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.
"రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులకు నెలకు జీతాలు ఇవ్వలేని రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు వచ్చాయంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. మార్గదర్శిలో ఏమైనా అక్రమాలు, అన్యాయాలు జరిగితే విచారణ చేయండి. కాంగ్రెస్ పార్టీగా దానిని మేము కాదనడం లేదు. కానీ కక్ష సాధింపు ధోరణి అనేది యాజమాన్యాల మీద తప్పు. ఒక సంస్థ ప్రజల నమ్మకాన్ని చూరగొని లక్షల, కోట్ల పెట్టుబడులు వస్తే.. ఆ సంస్థను కావాలని నిర్వీర్యం చేసుకుంటే.. మన రాష్ట్ర ప్రగతే కుంటుపడుతుంది. ఏ సంస్థలోనైనా సాంకేతిక సమస్యలు రావడం సహజం. ప్రజలకు మేలు చేసే ఇలాంటి సంస్థలను మన ప్రభుత్వాలు ఎంకరేజ్ చేయాలి కానీ కక్ష సాధింపు చర్యలు చేయకూడదు"-గిడుగు రుద్రరాజు, ఏపీసీసీ అధ్యక్షుడు
ఉద్యోగులకు ఫస్ట్ తేదీన జీతాలు ఇవ్వలేని ప్రభుత్వాన్ని నమ్మి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఎలా పెడతారని ప్రశ్నించారు. తెలుగు జాతి గర్వపడే సంస్థలైన జీఎంఆర్, మార్గదర్శి వంటి ఆఫీసులపై కక్ష పూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. దశాబ్దాలుగా కష్టపడి నెలకొల్పిన సంస్థలపై రాజకీయ, కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. బడ్జెట్లో సంక్షేమంతో పాటు అభివృద్ధికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా సహా అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు కానీ ఏ ఒక్క హామీని అమలు చేయలేదని గిడుగు విమర్శించారు.
13లక్షల కోట్లు పెట్టుబడులు హాస్యాస్పదం: విశాఖలో ఈ నెల 3,4వ తేదీన నిర్వహించిన ప్రపంచ పెట్టబడిదారుల సదస్సులో 13లక్షల కోట్లు పెట్టబడులు వచ్చినట్లు సీఎం జగన్ తెలిపారు. ఈ సదస్సులో 352 ఎంవోయూలతో అవగాహన ఒప్పందాలు జరిగినట్లు సీఎం తెలిపారు. ఈ ఎంవోయూలు వాస్తవ రూపం దాల్చేందుకు సరళీకృత విధానాలు అవలంబిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నట్లు జగన్ పేర్కొన్నారు. ఒక్క ఇంధన రంగంలోనే 40 ఎంవోయూలపై సంతకాలు జరిగినట్లు తెలిపారు. అయితే ఈ పెట్టుబడులపై స్పందించిన గిడుగు రుద్రరాజు హాస్యాస్పదమన్నారు.
ఇవీ చదవండి: