వైకాపా నాయకులు గవర్నర్‌ను కలిసి తెదేపా నాయకులపై ఫిర్యాదు చేయడంపై స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు స్పందించారు. ఇనమెట్ల గ్రామంలో తనపై దాడి చేసినవారితో పాటు... ఆ దాడి కుట్ర వెనుక ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలింగ్ బూత్‌ను వైకాపా శ్రేణులు ఆక్రమించి, రిగ్గింగ్ చేశారనే సమాచారంతో అక్కడకు వెళ్లిన తనపై వైకాపా నాయకులు దాడికి దిగారని ఆరోపించారు.
అసెంబ్లీకి రానివాళ్లు జీతం ఎలా తీసుకుంటారు?
వైకాపా నేతలు తనపై కావాలనే... పథకం ప్రకారం దాడి చేశారని కోడెల అన్నారు. తెలుగుదేశం పార్టీకీ.. వైకాపా పోటీయే కాదని అన్నారు. అసెంబ్లీకి రాని వైకాపా ఎమ్మెల్యేలు జీతం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. సభాపతిగా తాను నిష్పక్షపాతంగా పని చేశానని తెలిపారు. జగన్ ఎప్పూడూ హైదరాబాద్ లోనే ఉంటారు... కానీ ఆయనకు ఆంధ్రప్రజల ఓట్లు కావాలని ఎద్దేవా చేశారు.
జగన్‌ను ఆంధ్రా ప్రజలు ఎప్పటికీ కోరుకోరు..
ఆంధ్రాప్రజలు ఎప్పుడూ జగన్ లాంటి వ్యక్తికి, ఆ పార్టీకి ఓటు వేయరని కోడెల శివప్రసాద్ విమర్శించారు. ఆంధ్రా ప్రజలు చైతన్యం, విజ్ఞత ఉన్నవాళ్లని స్పష్టం చేశారు. ఏపీకి ఏం కావాలో ప్రజలకు స్పష్టంగా తెలుసునని అన్నారు.