AP Sarpanch Association Protests For Panchayat Funds : కేంద్రం నుంచి వచ్చిన 14, 15వ ఆర్థిక సంఘం నిధులు 8,660 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు చెల్లించకుండా దారి మళ్లించిందని రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్‌లు ఆందోళనకు దిగారు.
సర్పంచ్‌లకు సంకెళ్లు : రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్న సర్పంచ్‌ల నిధులను వెంటనే జమ చెయ్యాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ సర్పంచ్‌ల సంఘం ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు వినూత్నంగా నిరసన తెలిపారు. సర్పంచ్‌లకు చెక్ పవర్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సంకెళ్లు వేసిందని సర్పంచ్‌లు చేతులను కట్టి వేసుకొని నిరసన తెలిపారు. సర్పంచుల ఖాతాలో నిధులు లేనందున ఎలాంటి అభివృద్ధి పనులు చెయ్యలేక పోతున్నామని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధికార వైసీపీకి సర్పంచ్‌లు సైతం పాల్గొన్నారు.
Sarpanch Agitation Against YSRCP Government in State : అభివృద్ధి పనులు చేయలేకపోతున్నామని, ప్రజలు నిలదీస్తున్నారంటూ పలువురు సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్ సంయుక్త ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ గ్రామాల సర్పంచులు గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించి వినతి పత్రం అందజేసేందుకు ఏలూరు కలెక్టరేట్ కు విచ్చేశారు.
బిందెడు నీళ్లు ఇవ్వలేని స్థితిలో ఉన్నాం.. సర్పంచ్‌ల ఆవేదన
Sarpanch Protest Against Diversion of Panchayat Funds : కార్యాలయంలో గాంధీ విగ్రహం వద్దకు వెళ్లనివ్వకుండా పోలీసులు కార్యాలయం ప్రధాన ద్వారం గేట్లు మూసివేసి సర్పంచులు అడ్డుకున్నారు. తాము నిరసన తెలపడానికి రాలేదని.. గాంధీజీకి నివాళులర్పించి వినతి పత్రం అందజేసి వెళ్లిపోతామని చెప్పినా పోలీసులు వారికీ అనుమతి లేదంటూ అడ్డుకున్నారని సర్పంచ్‌లు తెలిపారు. దాంతో సర్పంచులు ప్రధాన ద్వారం గేటు ముందు బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు.
సీబీఐతో ఎంక్వయిరీ చేయించాలి : చేతులకు తాళ్లతో కట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం తమపై నిరంకుశంగా వ్యవహరిస్తుందని సర్పంచ్‌లు వినూత్నంగా నిరసన తెలిపారు. లోపలికి అనుమతి ఇవ్వకపోవడంతో ఫ్లెక్సీపై ఉన్న గాంధీజీ ఫోటోకి పూలమాల నివాళులర్పించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ ఛాంబర్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కడలి గోపాలరావు మాట్లాడుతూ కనీసం గాంధీజీ విగ్రహానికి పూలమాల వేయడానికి కూడా అనుమతి ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. సీబీఐతో ఎంక్వయిరీ చేయించి దారి మళ్లించిన నిధులను పంచాయతీలకు జమ చేయాలని డిమాండ్ చేశారు.
సర్పంచ్‌లకు అన్యాయం : ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ సంఘం జిల్లా అధ్యక్షుడు పాలడుగు లక్ష్మణరావు మాట్లాడుతూ ఇటీవల జిల్లాలో పలు గ్రామాల్లో కేంద్ర కమిటీ పర్యటించి ఆయా పంచాయతీలో పరిశీలించిందని నిధులు దారి మళ్లించిన విషయాన్ని సర్పంచ్‌లకు అన్యాయం జరిగిందనే విషయాన్ని అధికారుల వివరణలో తేటతెల్లమైందని తెలిపారు. సర్పంచ్‌లకు తెలియకుండా విద్యుత్ బిల్లు కట్ అవ్వడం ఆనందంగా ఉందని డీపీఓ చెప్పడం సరికాదు అన్నారు. ఆయన్ని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
Sarpanches Dharna: భగ్గుమన్న సర్పంచులు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు
గ్రామ పంచాయితీల నిధులను ప్రభుత్వం కాజేస్తుందని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సర్పంచుల సమైక్య అధ్యక్షురాలు ఎన్ శాంత కుమారి ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయితీల విషయంలో ప్రభుత్వ వైఖరి నశించాలని ప్రభుత్వానికి మంచి బుద్ధి కలగజేయాలని కోరుతూ గాంధీ జయంతి సందర్భంగా సర్పంచ్‌లు అమలాపురంలో కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
నిధులను వెంటనే విడుదలు చేయాలి : రాష్ట్రంలోని సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాలుగా మార్చేసి వారి హక్కులను హరిస్తున్న చరిత్ర ముఖ్యమంత్రి జగన్‌కే దక్కుతుందని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాల సర్పంచ్‌ల సంఘ అధ్యక్షులు గొండు శంకర్ అవేదన వ్యక్తం చేశారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని శ్రీకాకుళం గాంధీ పార్కులోని మహాత్మా విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. అనంతరం గాంధీజీ విగ్రహం నుంచి నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 14,15వ ఆర్థిక సంఘం నిధులను వెంటనే పంచాయతీ అకౌంట్ లో జమ చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన : ప్రభుత్వం ఇప్పటికైనా దారి మళ్లించిన నిధులు వెంటనే తిరిగి ఇవ్వాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని సర్పంచ్‌లు హెచ్చరించారు.