Govt to Sell Seats in New Medical Colleges: జగన్‌లోని భూస్వామ్య, పెత్తందారీ స్వభావాన్ని.. ఆయన ప్రభుత్వ కొత్తవిధానం.. మరోసారి బహిర్గతం చేసింది. కొత్తగా వచ్చిన 5 వైద్యకళాశాలల్లో సగం సీట్లకు ప్రభుత్వం లక్షల్లో ధరలు నిర్ణయించింది. వైద్య కళాశాలల్లో సీట్లను సంతలో నిస్సిగ్గుగా అమ్మేయడం వల్ల.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లోని పేదలు 204 సీట్లను కోల్పావాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రస్తుత నిబంధనలే అమలులో ఉంటే.. త్వరలో అందుబాటులోకి వస్తాయని చెబుతున్న 12 కళాశాలలను కలిపి లెక్కిస్తే.. వారు కోల్పోయే సీట్లు 694. ఇవన్నీ ఒక్క ఏడాదిలో కోల్పేయే సీట్లు. తాను 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటానని.. జగన్ పదేపదే చెబుతున్నారు. కలలు కంటున్నారు. ఆయన అనుకున్నట్లే మరో 30 ఏళ్లు అధికారంలో ఉంటే.. అప్పటికీ ఆ 17 కళాశాలలే ఉన్నాయనుకుంటే.. ప్రస్తుత నిబంధనలే అమల్లో ఉంటే.. బడుగు బలహీనవర్గాలు కోల్పోయే సీట్లు 20 వేల 820.
Govt Selling Medical Seats: ఎంబీబీఎస్‌లో సీటు రావడమంటే ఒక విధంగా యజ్ఞమే. విపరీతమైనపోటీని తట్టుకుని నీట్‌లో మంచి ర్యాంకు సాధించాలి. మొదటి ప్రయత్నంలో సీటు రాకపోతే.. దీర్ఘకాల శిక్షణ తీసుకుంటారు. దానికే లక్షల్లో ఖర్చవుతుంది. అన్ని కలలు కని.. ఒక తపస్సులా శ్రమించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల పిల్లలు, వారి తల్లిదండ్రుల ఆశల్ని.. నిర్దాక్షిణ్యంగా చిదిమేయడం.. ప్రభుత్వమే ఫక్తు వ్యాపార సంస్థలా వ్యవహరిస్తూ సీట్లను తెగనమ్ముకోవడమేనా.. పేదల్ని ఉద్ధరించడమంటే? ప్రతిభ కలిగిన బడుగు, బలహీనవర్గాలు పిల్లల కలల్ని కాలరాయడం.. వారిని ఆదుకోవడం ఎలా అవుతుంది.
Approval for Replacement of Medical Seats: ఈ విద్యాసంవత్సరం నుంచి రాజమహేంద్రవరం, నంద్యాల, మచిలీపట్నం, విజయనగరం, ఏలూరులో ఏర్పాటైన ప్రభుత్వ వైద్యకళాశాలల్లో 150 చొప్పున 750 సీట్ల భర్తీకి జాతీయ వైద్యకమిషన్ ఆమోదం తెలిపింది. వీటిలో జాతీయ కోటా కింద 15 శాతం అంటే.. 112 సీట్లు వెళ్లాయి. మిగిలిన 638 సీట్లలో 50 శాతం కన్వీనర్ కోటాలో.. రాష్ట్ర విద్యార్థులతో భర్తీ చేశారు. ఇందులో 25 శాతం సీట్లు ఓపెన్ కేటగిరీ, 25 శాతం రిజర్వేషన్ కోటాకు కేటాయించారు. మిగిలిన 50 శాతం సీట్లలో 35 శాతం B కేటగిరీ కింద, 15 శాతం ఎన్నారై కోటా కింద భర్తీ చేస్తున్నారు. ఇలా ప్రతి కళాశాలలోనూ 50 శాతం సీట్లు అమ్మకానికి పెట్టారు. దీంతో 5 కళాశాలల్లోని ఎస్సీ విద్యార్థులు 48 సీట్లు, ఎస్టీ విద్యార్థులు 19 సీట్లు, బీసీ విద్యార్థులు 93 సీట్ల చొప్పున మొత్తం 160 సీట్లు కోల్పోయారు.
AP JUDA on Medical seats మెడికల్ సీట్ల అమ్మకాలపై.. ఏపీ జూడాల అల్టిమేటం.. ఈనెల 7 తర్వాత సమ్మెకు
SC, ST, BC Category Medical Seats: ప్రతిభ గల ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు.. ఓపెన్ కేటగిరీ సీట్లలోనూ ప్రవేశాలు పొందుటుంటారు. ఇప్పుడు కొత్త విధానంతో ఓపెన్ కేటగిరీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు వచ్చే సీట్లకూ గండి పడుతోంది. సాధారణంగా ఓపెన్ కేటగిరీ సీట్లలో ప్రతిభ గల ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు.. సగటున 15 శాతం వరకు సీట్లు పొందుతుంటారని గణాంకాలు చెబుతున్నాయి. ఒంగోలు ప్రభుత్వ కళాశాలలో 59 ఓపెన్ కేటగిరీ సీట్లకుగాను.. 27 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు వచ్చాయి. అంటే దాదాపు సగం సీట్లు వారికి దక్కినట్లే. కొత్తగా వచ్చిన 5 వైద్య కళాశాలల్లో 319 సీట్లను ప్రభుత్వం అమ్మేయకుండా రిజర్వేషన్ల విధానాన్ని అనుసరించి భర్తీ చేసి ఉంటే.. వాటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు 160 సీట్లతోపాటు.. ఓపెన్ కేటగిరీలోనూ 24 సీట్ల వరకు దక్కేవి. అంటే జగన్ ప్రభుత్వ విధానం వల్ల కేవలం 5 కళాశాలల్లోనే వారు 204 సీట్లు కోల్పోతున్నారు.
Medical Seat Cost is 90 Lakh Rupees: కొత్త వైద్య కళాశాలల్లో 50 శాతం సీట్లు అమ్మకానికి పెట్టిన జగన్ ప్రభుత్వం.. B కేటగిరీ సీటుకు 12 లక్షలు, ఎన్నారై కోటా సీటుకు 20 లక్షల రూపాయలు ఫీజు నిర్ణయించింది. నాలుగున్నరేళ్ల ఎంబీబీఎస్ కోర్సును 90 లక్షల రూపాయలు కట్టి చదివే స్తోమత.. పేదలైన దళిత, గిరిజన బిడ్డలకు ఉంటుందా? ఇలా సీట్లు తెగనమ్మడం రాజ్యాంగం.. ఆయా వర్గాలకు కల్పించిన హక్కును కాలరాయడం కాదా? 5 కళాశాలల్లో ప్రభుత్వం అమ్మకానికి పెట్టిన సీట్లలో డబ్బు కట్టి చేరిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కేవలం 22 మందే. వారిలో 20 మంది ఎస్సీలు, ఇద్దరు ఎస్టీలు. వారు కూడా ధనికుల పిల్లలు.. ఆర్థిక స్తోమత ఉన్నవారు. ఆయా వర్గాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులు సీట్లు కొనుక్కోలేక.. ఎంత వేదన పడతారో ఈ ప్రభుత్వానికి అర్థమవుతోందా? ప్రభుత్వం ఉన్నది పేదలకు మేలు చేయడానికా.. లేదా విద్యావ్యాపారం చేస్తూ వారి హక్కుల్ని కాలరాయడానికా అనే సందేహం తలెత్తుతోంది.
Reservation of Medical Seats for EWS Categories: రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన ఈడబ్ల్యూఎస్ వర్గాలవారు ఉన్నారనే విషయాన్ని జగన్ మరచిపోయినట్లున్నారు. ఎంతో కీలకమైన వైద్యవిద్య సీట్ల భర్తీలో వారికి కేటాయింపులు ఉండాలనే విషయాన్ని పరిగణనలోకే తీసుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లను కొత్త వైద్య కళాశాలల్లో అమలు చేస్తున్నా.. జగన్ మాత్రం కేంద్రం ఇంకా అనుమతివ్వలేదన్న సాకుతో మిన్నకున్నారు. పొరుగు రాష్ట్రంలో ఉన్న విధానాన్ని ఇక్కడా అమలు చేసి.. ఆ వర్గం విద్యార్థులకు మేలు చేయడానికి ఉన్న అభ్యంతరమేంటి? కేంద్రం అనుమతే కావాలనుకుంటే.. తరచూ దిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను, అధికారులను కలిసే జగన్.. ఈ విషయాన్ని వారి వద్ద ప్రస్తావించి.. ఎందుకు అనుమతి తెచ్చుకోలేదు?
Students are Expressing Grievances: ప్రభుత్వ సీట్ల అమ్మకం నిర్ణయం ప్రస్తుతానికి ఎంబీబీఎస్ ప్రవేశాలకే అంటున్నా.. భవిష్యత్తులో పీజీ సీట్లకూ వర్తింపజేస్తారేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ విద్యార్థులు.. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. సమ్మె చేస్తామని ప్రకటించారు. కానీ.. వారిపై ప్రభుత్వం ఎదురుదాడికి దిగింది. వారిని భయపెట్టి.. ఆందోళన ఉపసంహరించుకునేలా చేసింది. ప్రభుత్వ నిర్ణయం వైద్యవిద్య చదవాలనుకునేవారి ఆశలను అడియాసలు చేస్తోందని.. విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.