AP JAC Amaravati Leaders Protests: సమస్యల పరిష్కారం కోసం రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ఏపీ ఐక్య కార్యచరణ సమితి అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. కాకినాడ ధర్నా చౌక్ వద్ద ఉద్యోగులు నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్దీకరణతో పాటు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ప్రతినెల ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని కోరారు. డీఏ బకాయిలపైనా సాకులు చెప్పడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి.. లేకుంటే: ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి 47 రోజులుగా నిరసన తెలుపుతున్న ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రావడం లేదని ఏపీ జేఏసీ అమరావతి నాయకులు ఫణి పెర్రాజు అన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మలి దశ ఉద్యమంలో భాగంగా విజయవాడ ధర్నా చౌక్‌లో ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉద్యోగుల నిరసనలకు కార్మిక సంఘాలు మద్దతు పలికాయి.
ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ తో భేటీ అయి ఇచ్చిన 50 అంశాలపై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం దురదృష్టకరమన్నారు. ఏప్రిల్ 28వ తేదీన నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలి, లేదంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఆ ఉద్యోగులకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పదోన్నతులు కల్పించాలి: రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కంటే.. సామన్య ప్రజల పరిస్థితి బాగుందని ఏపీ జేఎసీ అమరావతి కర్నూలు జిల్లా అధ్యక్షుడు గిరికుమార్ రెడ్డి అన్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కర్నూలులోని ధర్నా చౌక్ వద్ద ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన విధంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా అమలు చేయాలని ఆయన కోరారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వారికి పదోన్నతులు కల్పించాలని కోరారు. ధర్నాలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొని సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
పాదయాత్రలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి: తమ సమస్యలు పరిష్కరించాలంటూ గుంటూరులో కాంటాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు నిరసనకు దిగారు. ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కాంటాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. గతంలో జగన్ హామీ ఇచ్చారని.. ఈ హామీను నిలబెట్టుకోవాలని ఏపీ జేఏసీ అమరావతి నేత మురళీకృష్ణ డిమాండ్ చేశారు. 22 ఏళ్ల క్రితం నియమించిన కాంట్రాక్టు ఉద్యోగులు ఇంకా అలానే మిగిలిపోయారని చెప్పారు. మిగతా రాష్ట్రాల్లో కాంట్రాక్టు ఉద్యోగులు రెగ్యులరైజ్ అవుతున్నారని.. ఇక్కడ మాత్రం వారికి నిరాశే ఎదురవుతుందని చెప్పారు. మాట తప్పకుండా.. మడప తిప్పకుండా ముఖ్యమంత్రి పాదయాత్రలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని మురళీ కృష్ణ డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: