అమరావతి నుంచి కార్యాలయాల తరలింపు విషయంలో ఈనెల 27వ తేదీ వరకూ యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పాలనా వికేంద్రీకరణ చట్టం, సీఆర్‌డీఏ చట్టాన్ని రద్దుచేస్తూ ప్రభుత్వం జారీచేసిన గెజిట్ ప్రకటనలు, చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన దాదాపు 50కిపైగా పిటిషన్లపై శుక్రవారం జస్టిస్ రాకేశ్‌కుమార్, జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.
మూడు రాజధానులు అనేవి విభజన చట్టానికి విరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. విభజన చట్టంలో ఒక్క రాజధాని ప్రస్తావన మాత్రమే ఉందని వివరించారు. పిటిషన్లను ప్రత్యక్ష పద్ధతిలో విచారించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోరగా... కొవిడ్ వల్ల ప్రత్యక్ష విచారణకు హాజరుకాలేమని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు తెలిపారు. గతంలో ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వుల గడువు ఇవాళ్టితో ముగుస్తుందని న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకురాగా.. స్టేటస్‌కో ఉత్తర్వులు ఈనెల 27వరకు అమల్లో ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. చట్టాల అమలుపై ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది. విచారణ ఈనెల 27కు వాయిదా వేసింది.