High Court on R5 Zone Issue: రాజధానేతర ప్రాంత వాసులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అమరావతిలోని ఆర్-5 జోన్‌లో హడావుడిగా చేపడుతున్న ఇళ్ల నిర్మాణ ప్రక్రియను సవాలు చేస్తూ.. రాజధాని వాసులు దాఖలు వేసిన వ్యాజ్యాలపై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. రైతుల తరఫున సీనియర్ న్యాయవాదులు ఉన్నం మురళీధరరావు, దమ్మాలపాటి శ్రీనివాస్, కారుమంచి ఇంద్రనీల్‌బాబు వాదనలు వినిపించారు. భూసమీకరణ నిబంధనలను అమలు చేశాకే ఆ భూములపై ప్రభుత్వానికి, సీఆర్‌డీఏకి హక్కులు దఖలు పడతాయన్నారు. రాజధానేతర ప్రజలకు ఇళ్లస్థలాలు ఇవ్వడానికి వీల్లేదని వాదించారు. హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తుది తీర్పు ప్రకారం.. అమరావతిలో అభివృద్ధి పనులు కొనసాగించాలన్నారు. రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వకుండా.. రాజధానేతరలకు ఇళ్లు నిర్మించబోతున్నారన్నారు. హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం అమరావతిలో భూములను అన్యాక్రాంతం చేయడానికి వీల్లేదని స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ఆ తీర్పును ఉల్లంఘిస్తూ ఇళ్ల స్థలాలకు ఇవ్వడం అక్రమం అని.. కేటాయిస్తున్న 1402 ఎకరాలకు ప్రభుత్వం.. సీఆర్‌డీఏకి ఇప్పటి వరకు పైసా చెల్లించలేదన్నారు. అందువల్ల ఆ భూముల విషయంలో ప్రభుత్వానికి అధికారం లేదని.. వాటిలో స్థలాల కేటాయింపు, ఇళ్ల నిర్మాణం చెల్లదన్నారు.
ఆర్5 జోన్ ఏర్పాటుకు తెచ్చిన సీఆర్‌డీఏ సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాలు హైకోర్టు ముందు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. హైకోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి పట్టాల చెల్లుబాటు ఉంటుందని.. వాటి ఆధారంగా ఎలాంటి హక్కులు కోరబోమని లబ్ధిదారులకు జారీ చేసే పట్టాల్లో షరతు విధించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని రైతుల తరపు న్యాయవాదులు వాదించారు. హైకోర్టు తుది తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే.. ఇళ్ల నిర్మాణం కోసం ఖర్చు చేసే కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అవుతుందన్నారు. ఇళ్ల పట్టాల వరకే సుప్రీంకోర్టు ఉత్తర్వులు పరిమితమవుతాయని.. ఇళ్ల నిర్మాణానికి సర్వోన్నత న్యాయస్థానం అనుమతి ఇవ్వలేదన్నారు.
అమరావతికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే భూములను జోనింగ్ రెగ్యులేషన్‌కు విరుద్ధంగా ఇతరులకు కట్టబెట్టబోతున్నారని వాదించారు. రాజధానిలో సెంటు ఇళ్ల స్థలాల కేటాయింపును హైకోర్టు గతంలో తప్పుపట్టిందని.. ఆ తీర్పును పక్కనపెట్టడానికే అమరావతి మాస్టర్ ప్లాన్‌ను సవరించారన్నారు. అమరావతిని ధ్వంసం చేయాలన్న దురుద్దేశంతోనే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందన్నారు. ఇళ్ల పట్టాల కేటాయింపు వ్యవహారం కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున.. పీఎంఏవై పథకం కింద నిధులను మంజూరు చేయబోమని కేంద్రం తేల్చిచెప్పిందన్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని.. న్యాయస్థానం నుంచి తుది ఉత్తర్వుల కోసం వేచిచూస్తున్నామని చెబుతూ.. మరోవైపు ఇళ్ల నిర్మాణానికి వేగంగా అడుగులు వేస్తోందన్నారు. ఇళ్ల నిర్మాణ ప్రక్రియను నిలువరించండి అని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్‌డీఏ తరఫున అదనపు ఏజీ పి.సుధాకర్‌రెడ్డి, కె.జగన్‌మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. భూములపై ప్రభుత్వానికి, సీఆర్‌డీఏకి హక్కు దఖలు పడలేదన్న పిటిషనర్ల వాదన సరికాదని.. హక్కు ఉన్నందునే గత ప్రభుత్వం 16 వందల 56 ఎకరాలను వివిధ సంస్థలకు కేటాయించిందన్నారు. భూములిచ్చిన రైతులకు ఇప్పటికే ప్లాట్లు కేటాయించి.. ధ్రువపత్రాలు ఇచ్చామన్నారు. దీంతో రాజధాని భూములపై ప్రభుత్వానికి హక్కు దఖలు పడిందన్నారు. ఆ భూముల్లో ఇళ్ల స్థలాలిచ్చే హక్కు ఉందన్నారు. సుప్రీంకోర్టు ఇళ్ల పట్టాల జారీకి అనుమతిచ్చిందంటే.. అందులో ఇళ్లు నిర్మించుకోవడానికీ అనుమతి లభించినట్లే భావించాలన్నారు. స్థలాల కేటాయింపు ఇళ్ల నిర్మాణంలో భాగమని.. రెండింటినీ వేర్వేరుగా చూడకూడదన్నారు. ఇళ్ల పట్టాలో షరతును ‘తప్పుగా పేర్కొన్న’ మాట వాస్తవమేనన్నారు.
ఇళ్ల నిర్మాణం కోసం తీసుకున్న భూములకు సొమ్ము చెల్లించేందుకు ప్రభుత్వానికి సీఆర్‌డీఏ కమిషనర్ సమయం పొడిగించారన్నారు. హైకోర్టు తుది తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినా... ఇళ్ల నిర్మాణ ఖర్చు వృథా కాదన్నారు. ఎందుకంటే సీఆర్‌డీఏ చట్టప్రకారం సమీకరించిన మొత్తం భూమిలో 5 శాతంలో.. ఆర్థికంగా వెనుకబడిన వారికి ఇళ్లు నిర్మించాల్సి ఉందన్నారు. ఒరిజినల్ మాస్టర్‌ప్లాన్ అందుకు అనుగుణంగా లేనందున సవరణ చేశామన్నారు. ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు భూములు లేనందున ఎలక్ట్రానిక్ సిటీ కోసం కేటాయించిన స్థలాన్ని తీసుకున్నామని వాదించారు. ఎలక్ట్రానిక్ సిటీకి వేరే చోట భూమి కేటాయిస్తామన్నారు. ఇళ్ల స్థలాలిస్తే సామాజిక అసమతుల్యత ఏర్పడి పిటిషనర్ల భూములకు విలువ తగ్గుతుందేమోనని.. వారు ఇళ్ల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులిచ్చే వ్యవహారంపై నిర్ణయాన్ని వాయిదా వేసింది.