AP Govt Negligence on Persons with Disabilities: తల్లిదండ్రులకు భారం కాకుండా సహచరులతో కలిసి పనులు చేస్తూ వచ్చిన కూలి డబ్బులతో సొంత అవసరాలు తీర్చుకుంటున్న దివ్యాంగులను జగన్ ప్రభుత్వం కష్టాల్లోకి నెట్టింది. తమ గ్రామంలోనే కొన్నేళ్లుగా ఉపాధి పొందుతున్న లక్షలాది మంది దివ్యాంగులకు కల్పించిన ప్రత్యేక సదుపాయాలను ప్రభుత్వం తొలగించింది.
ఈ కారణంగా చాలీచాలని వేతనాలతో కుటుంబానికి భారమై వారు ప్రస్తుతం తీవ్ర అవస్థలు పడుతున్నారు. జాతీయ ఉపాధి హమీ పథకంలో దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయాలు వైసీపీ పాలనలో అటకెక్కాయి.కేంద్ర ప్రభుత్వమేఇందుకు కారణమని నిందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అన్యాయానికి గురైన దివ్యాంగులకు తిరిగి న్యాయం జరిగేలా ఒక్క ప్రయత్నమూ లేదు. కేంద్రానికి లేఖ రాసి దివ్యాంగులకు జరిగిన అన్యాయం గురించి వివరించిన దాఖలాలూ లేవు.
Irregularities in MGNREGA Works: ఉపాధి హామీ పథకంలో అక్రమాలు.. సామాజిక తనిఖీల పేరుతో భారీగా దోపిడీ
MGNREGA Implementation in AP: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జాబ్‌కార్డు కలిగిన దివ్యాంగులకు 2021కి ముందు ఏడాదిలో 100-150 రోజులు పని కల్పించేవారు. మిగిలిన వారికి కుటుంబం మొత్తానికి 100 రోజుల పని దినాలు కల్పిస్తే.. దివ్యాంగులకు 50 ఎక్కువ పని దినాలను కేటాయించేవారు. వీరిని ఒక్కరినే కుటుంబంగా పరిగణించడంతో మరింత లబ్ధి చేకూరేది. 30 శాతం భత్యం కూడా అదనంగా ఇచ్చే వారు. ఉదాహరణకు ఒక గ్రూపులోని 10 మంది కూలీలకు ఒక అడుగు లోతు, 10 మీటర్ల పొడవు, 5 మీటర్ల వెడల్పులో చెరువులో మట్టి తీసే పని అప్పగిస్తే.. వికలాంగుల గ్రూపులోని 10 మంది సభ్యులకు అదే పని విస్తీర్ణాన్ని 30 శాతం మేర తగ్గించి కేటాయించేవారు.
అధికారిక లెక్కల్లో వీరు కూడా మిగిలిన గ్రూపులతో సమానంగా పని చేసినట్లుగానే చూపించేవారు. దీనివల్ల 30 శాతం తక్కువ పని చేసినా ఇతర గ్రూపుల సభ్యులతో సమానంగా దివ్యాంగులకు వేతనం వచ్చేది. ఉపాధి పనులకు హాజరయ్యే దివ్యాంగులు 2021 నవంబరు నుంచి అదనపు సదుపాయాలను కోల్పోయారు. పని దినాలను 100కే పరిమితం చేశారు. ఒక్కరిని కుటుంబంగా పరిగణించే విధానం కూడా లేదు.
ఉపాధి హామీ పథకంలో అక్రమాలు.. కూలీల కష్టాన్ని దోచుకుంటున్న ఫీల్డ్ అసిస్టెంట్
కుటుంబంలో ఒక సభ్యుడిగానే వీరిని పరిగణిస్తున్నారు. దీనివల్ల సంవత్సరానికి కేటాయించే 100 పని దినాలు కుటుంబంలోని మిగతా సభ్యులతో కలిసి ఉపయోగించుకోవాలి. ఉదాహరణకు నలుగురు సభ్యులుండే కుటుంబంలో ఒక్కో దివ్యాంగునికి ఏటా 25 రోజులకు మించి పని దినాలు రావడం లేదు. దీనివల్ల వేతనం కింద వచ్చే ఆదాయం 50 శాతానికి పైగా తగ్గిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జాతీయ గ్రామీణ ఉపాది హామీ పథకం అమలుకు సంబంధించి అన్ని రాష్ట్రాలనూ.. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్‌ఫర్మేటిక్ సెంటర్ పోర్టల్‌కు అనుసంధానించడంతో.. అప్పటి వరకు అమలులో ఉన్న ప్రత్యేక సదుపాయాలు దివ్యాంగులు కోల్పోయారని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఉపాధి పనుల సమాచారం టీసీఎస్ ఆధ్వర్యంలోని పోర్టల్‌లో నిక్షిప్తం చేసేవారు. దీనినే కేంద్రం పరిగణనలోకి తీసుకునేది.
2021 నవంబరు తర్వాత ఎన్‌ఐసీ పోర్టల్ వినియోగం తప్పనిసరి చేయడంలో టీసీఎస్ పోర్టల్ పక్కకు వెళ్లిపోయింది. దివ్యాంగులు అదనపు సదుపాయాలు కోల్పోవడానికి కేంద్రం చేసిన మార్పులే కారణమని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన లక్షలాది మందికి న్యాయం జరిగేలా ఎలాంటి ప్రయత్నం చేయలేదు. కనీసం అదనపు భత్యం కల్పించేలా కూడా చర్యలు చేపట్టలేదు.