గుంటూరు గ్రామీణ ప్రాంతంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున.... లాక్ డౌన్ అమలును కట్టుదిట్టం చేస్తున్నామని ఎస్పీ విజయరావు తెలిపారు. మండలాల మధ్య రాకపోకలను పూర్తిగా నియంత్రిస్తున్నట్లు చెప్పారు. మరణాలు సంభవించినప్పుడు, అత్యవసర వైద్యం అవసరమైన వారికి పాసులు ఇస్తున్నట్లు తెలిపారు.
కృష్ణా జిల్లాలో లాక్‌డౌన్ పటిష్టంగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు. మరింత పకడ్బందీ చర్యల కోసం ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. గ్రీన్ జోన్ మండలాలు, పురపాలికల్లో సడలింపు అధికారాలు.. ప్రత్యేక అధికారులకే ఉంటాయన్నారు. జిల్లాలోని 16 మండలాలు, 10 పురపాలికలను రెడ్ జోన్లుగా గుర్తించామని... ఆ ప్రాంతాల్లో ఎవరూ బయటకు వెళ్లకుండా కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశామని కలెక్టర్ స్పష్టం చేశారు.
నెల్లూరు జిల్లాలో 28 రెడ్‌జోన్లు గుర్తించి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ శేషగిరిబాబు తెలిపారు. పక్కా ప్రణాళికతో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో లాక్‌డౌన్ మరింత పకడ్బందీగా అమలు చేయనున్నట్లు కలెక్టర్ నివాస్ స్పష్టంచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆహార పరిశ్రమలకు తప్ప... మిగిలిన వాటికి ఎలాంటి మినహాయింపు లేదనన్నారు. మే మూడో తేదీ తర్వాత కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కరోనా కట్టడి దిశగా విశాఖ పారిశ్రామిక ప్రాంతం... గాజువాక పరిసరాల్లో పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు... శాంతిభద్రతల డీసీపీ-2 ఉదయ్ భాస్కర్ బిల్లా తెలిపారు.
ఇదీ చదవండి: తండ్రి అంత్యక్రియలకు ముఖ్యమంత్రి దూరం