Christmas Wishes: క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని క్రైస్తవ సోదర సోదరీమణులకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ అంటే ఏసుక్రీస్తును స్మరించుకునే సంతోషకరమైన సమయమన్నారు. ప్రపంచంలోని ప్రజలందరి మధ్య ప్రేమ, సహనం, కరుణ పాదుకొల్పే యేసు బోధనలను గౌరవించటానికి ఇది ఒక మంచి సందర్భం అన్నారు. సద్గుణం, విశ్వాసంతో కూడిన జీవితాన్ని గడపడానికి యేసుక్రీస్తు జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకమని గవర్నర్ పేర్కొన్నారు. తాను క్రైస్తవ సోదర, సోదరీమణులతో కలిసి ప్రపంచ శాంతి, సామరస్యం కోసం ప్రార్థిస్తున్నానని గవర్నర్ తెలిపారు.
సీఎం శుభాకాంక్షలు: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కరుణ, ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం.. ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తద్వారా, మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారన్నారు. దుర్మార్గం నుంచి సన్మార్గానికి, అమానుషత్వం నుంచి మానవత్వానికి, చెడు నుంచి మంచికి, దురాశ నుంచి దాతృత్వం, త్యాగాలకు జీసస్ బాటలు వేశారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరిగేలా ఎల్లప్పుడూ ఆ కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు లభించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు.