తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పర్యవేక్షణలోనే హథీరాంజీ మఠం భూముల కబ్జా వ్యవహారం సాగుతోందని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వేమూరి ఆనంద సూర్య ఆరోపించారు. రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోని హథీ రాంజీమఠం భూముల్ని కొట్టేయడానికి.. మఠానికి చెందిన మహంత్ అర్జున్‌దాస్‌ను సస్పెండ్ చేసి, భూముల పర్యవేక్షణ బాధ్యతను శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఈవో చంద్రశేఖర్‌రెడ్డికి ప్రభుత్వం అప్పగించిందని అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో మాట్లాడిన ఆయన... మంగళవారం నుంచి అర్జున్‌దాస్ కనిపించడం లేదని, ఆయన గదిని సీజ్ చేయించారని వెల్లడించారు. వేల కోట్ల విలువైన రెండు వేల ఎకరాల భూముల్ని కాజేయాలన్న కుట్రతో, ప్రభుత్వాధికారుల సాయంతో వైవీ సుబ్బారెడ్డి మొత్తం తతంగాన్ని నడిపిస్తున్నారని విమర్శించారు. స్వరూపానందేంద్రస్వామి ఆశ్రమంలో మకాం వేసిన వై.వీ.సుబ్బారెడ్డి... భీమీలి సమీపంలో 67ఎకరాల దేవాదాయశాఖ భూమిని ఏ విధమైన టెండర్లు పిలవకుండా లీజు పద్ధతిలో కాజేయడానికి యత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
పోర్టు ట్రస్ట్ కార్మికుల కోసం దాతలు ఇచ్చిన భూముల్ని కొట్టేయడానికి ప్రభుత్వం ఒక పథకం ప్రకారం వ్యవహరిస్తోందన్నారు. వీటిపై తాము న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. అర్చకుల సంక్షేమనిధికి చెందిన రూ.234కోట్ల నిధులను వారి సంక్షేమానికి వినియోగించకుండా వైకాపా ప్రభుత్వం వాటిని దారి మళ్లించిందని మండిపడ్డారు. పేద బ్రాహ్మణులకు పింఛన్లు అందడం లేదని, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఉన్న మల్లాది విష్ణు తక్షణమే ఈ అంశంపై జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి