Engineering Student Commits Suicide in IIT Madras: ఐఐటీల్లో వరుస ఆత్మహత్యలు ఇటు విద్యార్థులను, అటు తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా ఐఐటీ చెన్నైలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నెల రోజులలోనే ఐఐటీ మద్రాస్‌లో ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడంతో.. తల్లిదండ్రులు భయపడుతున్నారు.
ఐఐటీ మద్రాస్‌లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన విద్యార్థిగా అతనిని గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వైపు పుష్పక్ శ్రీ సాయి అనే విద్యార్థి.. ఐఐటీ మద్రాస్‌లో ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. కానీ ఈ రోజు తరగతులకు వెళ్లకుండా హాస్టల్ గదిలోనే ఉండిపోయాడు. దీంతో ఇతర విద్యార్థులు తన గదికి వచ్చి పరిశీలించగా.. హాస్టల్ గదిలోనే ఆత్మహత్య చేసుకుని ఉండటాన్ని గమనించారు.
దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి పోలీసులు వచ్చి.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పుష్పక్ మృతిపై హాస్టల్లోని ఇతర విద్యార్థులను అడిగి మరింత సమాచారాన్ని పోలీసులు తెలుసుకున్నారు. అదే విధంగా ప్రొఫెసర్స్ నుంచి కూడా మరింత సమాచారాన్ని సేకరించారు.
తమ స్నేహితుడు పుష్పక్ మృతిపై.. ఇతర విద్యార్థులు పోలీసులకు వివరాలను తెలియ చేశారు. ఇంజనీరింగ్ చదువుతున్న పుష్పక్.. చాలా సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యాడని చెప్పారు. దీనిపై గత రెండు నెలలుగా డిప్రెషన్లో ఉన్నాడని అన్నారు. దీంతో పుష్పక్ మరణానికి ఇది కూడా ఓ కారణం అయి ఉంటుందని.. హాస్టల్లో ఉండే తన స్నేహితులు తెలిపారు.
పుష్పక్ మృతిపై పోలీసులు.. తన ఫోన్‌ని కూడా పరిశీలిస్తున్నారు. ఫోన్ ద్వారా మరింత సమాచారం తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. విద్యార్థి మృతిపై ఐఐటీ మద్రాస్ స్పందించింది. దీనిపై ఐఐటీ కమిటీ సమగ్రమైన దర్యాప్తు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. పుష్పక్ మృతిపై పూర్తి నివేదికను ఐఐటీ కమిటీ సిద్ధం చేస్తుందని తెలిపారు.
అప్పట్లో సంచలనం: కాగా కొన్ని సంవత్సరాల క్రితం ఐఐటీ మద్రాస్‌లో.. కేరళకు చెందిన ఫాతిమా ఆత్మహత్య ఘటన.. తమిళనాడు వ్యాప్తంగా సంచలనం అయింది. అదేవిధంగా నెల రోజుల వ్యవధిలోనే.. ఐఐటీ మద్రాస్‌లో ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. గత ఆరు సంవత్సరాలలో మొత్తం 11 మంది విద్యార్థులు ఐఐటీ మద్రాస్‌లో ఆత్మహత్య చేసుకున్నారని నివేదికలు చెప్తున్నాయి.
వరుస ఆత్మహత్యలు: దీంతో వరుస ఆత్మహత్యలతో విద్యార్థుల తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. వరుసగా ఆత్మహత్యలు చోటు చేసుకోవడంతో దీనిపై ఐఐటీ డైరెక్టర్ స్పందించారు. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ కామకోటి స్పందించి.. విద్యార్థుల ఆత్మహత్యలు నివారించడానికి తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా చర్చిస్తామని తెలిపారు.
ఇవీ చదవండి: