అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా 2017లో గత ప్రభుత్వం అంబేడ్కర్ స్మృతివనం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాజధాని అమరావతి పరిధిలోని శాఖమూరు సమీపంలో 20 ఎకరాల భూమిని కేటాయించి... అక్కడ 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహంతో పాటు సమావేశ మందిరం, గ్రంథాలయం, ధ్యానమందిరం, ప్రదర్శనశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2017 ఏప్రిల్ 14న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ స్మృతివనానికి శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులు సైతం ప్రారంభించారు.
ఇప్పుడు గుంటూరు మార్పు
వైకాపా అధికారంలోకి వచ్చాక అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా గుంటూరులో స్మృతివనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. నగర శివార్లలో మానససరోవరం పార్కులో ఐదెకరాల స్థలాన్ని గుర్తించారు. అయితే వేరే చోటికి స్మృతివనం తరలించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని ప్రాంతంలోనే స్మృతివనం పనులు కొనసాగించాలని ఎస్సీ, ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పనులు జరుగుతున్న సమయంలో ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోవటాన్ని తెదేపా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఖండించారు. ప్రస్తుతానికి గుంటూరులో స్థలం మాత్రమే గుర్తించారు. ఎలాంటి కేటాయింపులు జరపలేదు. ఇలాంటి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
ఇదీ చూడండి: