Capital issue: అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగాలంటూ మహిళ రైతులు.. దీక్షా శిబిరాలలో కొలువుదీరిన వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. న్యాయస్థానం తీర్పు మేరకు రాజధానిని వేగంగా నిర్మించాలని పార్వతి తనయుడికి మొక్కుకున్నారు. సెప్టెంబర్ 12న జరగబోయే రెండో విడత మహా పాదయాత్రకు ఎలాంటి ఆటంకలు లేకుండా చూడాలని విఘ్నేశ్వరుడికి విన్నవించారు.
Amaravati farmers Maha Padayatra: 1000 రోజులు సమీపిస్తున్నా ప్రభుత్వంపై రాజధాని రైతుల పోరాటం ఆగడం లేదు. దేవుడు కరుణించినా పూజారి వరమియ్యనట్లుగా మారింది రైతులు, ఆ ప్రాంత ప్రజల పరిస్థితి. కోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చినా, ఎన్ని చీవాట్లు పెట్టినా మళ్లీ ఏదో ఒక రూపంలో మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెస్తోంది. కానీ రైతులు, రాజధాని ప్రజలు మాత్రం తమకు ఏకైక రాజధానిగా అమరావతే ఉండాలంటూ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నారు. రైతులు, మహిళలు చేస్తున్న ఉద్యమం సెప్టెంబరు 12కి వెయ్యి రోజులకు చేరుకుంటున్న సందర్భంగా మహా పాదయాత్ర చేపట్టనున్నారు. తుళ్లూరు నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర-2 రూట్ మ్యాప్‌ను ఐకాస నాయకులు విడుదల చేశారు. మొత్తం 60రోజులు పాదయాత్ర సాగనుందని తెలిపారు.
తుళ్లూరు మండలం వెంకటపాలెం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందని ఐకాస నాయకులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం వరకు యాత్ర సాగుతోందని వెల్లడించారు. ప్రతి ఎనిమిది రోజులకోసారి సెలవు ప్రకటించారు. గుంటూరు, కృష్ణా, ఏలూరు, రాజమండ్రి, తుని, విశాఖ, విజయనగరం మీదుగా శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి ఆలయం వరకు యాత్ర సాగనుందని ఐకాస నాయకులు తెలిపారు. యాత్రను విజయవంతం చేసేందుకు అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి నాయకులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా పాదయాత్ర అనుమతి కోసం ఐకాస నేతలు ఇప్పటికే డీజీపీ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. యాత్ర సమయంలో ఇబ్బందులు కలగకుండా అంబులెన్స్, బయోటాయ్లెట్ల వాహనాలను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇవీ చదవండి: