Farmers Protest For cheques at Tullur: కౌలు చెక్కులు ఇవ్వాలంటూ అమరావతి ఎస్సీ రైతులు సీఆర్డీఏ అధికారులు కాళ్లపై పడ్డారు. ఆరు నెలలుగా రాజధానిలో అసైన్డ్ రైతులకు కౌలు చెక్కులు ఇవ్వటం లేదని.. రైతులు, మహిళలు తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని డిప్యూటీ కలెక్టర్ సాయిబాబుని రైతులు డిమాండ్ చేశారు. విచారణ పేరుతో కాలయాపన చేయొద్దన్నారు. ఈ మేరకు ఆయనకు రైతులు వినతి పత్రం అందించారు.
అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేయరు.. ముస్తాబైన వాటిని ఉపయోగించరు... రైతుల ప్లాట్లు బాగు చేయకపోగా...వారికి కౌలు, కూలీలకు పింఛను సకాలంలో చెల్లించరు.. కానీ..రాజధాని భూముల్ని మాత్రం అమ్మేస్తామంటారు.. ఇవీ..అమరావతి రైతుల ప్రశ్నలు.. డిమాండ్ల సాధన కోసం.. తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయాన్ని అన్నదాతలు ముట్టడించారు.
రాజధాని అమరావతి రైతుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ అన్నదాతలు, రైతు కూలీలు ఆందోళనబాట పట్టారు. వైకాపా పాలనలో వార్షిక కౌలు చెల్లింపు ఏటా ఆలస్యమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఐడీ కేసుల పేరుతో.. అసైన్డ్ రైతులకు కౌలు చెల్లింపు నిలిపివేయగా.. దాదాపు 3 వేల ఎకరాలకు కౌలుసొమ్ము రావాల్సి ఉంది. రాజధాని నిర్మాణాల నిలిపివేత వల్ల.. ఉపాధి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందంటూ.. తుళ్లూరులో ర్యాలీ, మహాధర్నా నిర్వహించారు. సీఆర్డీఏ కార్యాలయం ఎదుట బైఠాయించి.. సమస్యలపై ఎలుగెత్తారు. ఈ క్రమంలో.. కొందరు రైతులు సీఆర్డీఐ అధికారుల కాళ్లు పట్టుకున్నారు.
అప్పులు చేయడం తెలిసిన ప్రభుత్వానికి.. ప్రజల కష్టాలు తీర్చడం తెలియదా అని రైతులు ప్రశ్నించారు. మంచి చేస్తారులే అని మూడేళ్లు ఎదురుచూసినా.. ప్రభుత్వంలో కదలిక లేదని వాపోయారు. నిధుల్లేవని చెప్పడం కన్నా.. కేంద్రం ఇవ్వాల్సిన సొమ్ము రాబట్టొచ్చు కదా అని ప్రశ్నించారు.
రైతు కూలీలకు సకాలంలో పింఛను ఇవ్వకపోతే ఎలా అని రైతులు ప్రశ్నించారు. కోర్టు తీర్పును అమలు చేయకపోగా.. ప్రజల్ని హింసిస్తున్నారని ఆరోపించారు. సీఆర్డీఏ రైతుల డిమాండ్లు పరిష్కరించకపోతే.. కమిషనర్ కార్యాలయం ముట్టడిస్తామని రాజధాని ఐకాస కన్వీనర్ పువ్వాడ సుధాకర్ ప్రకటించారు.
రాజధాని రైతుల ఆందోళనకు వామపక్ష రైతు సంఘాల నాయకులు మద్దతు పలికారు. రైతుల మహాధర్నా సందర్భంగా.. తుళ్లూరులో అధికారులు పోలీసులను మోహరించారు. రైతులు సీఆర్డీఏ కార్యాలయం లోపలకు వెళ్తారన్న అనుమానంతో భద్రత పెంచారు.
ఇదీ చదవండి: