తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి అమరావతి రైతుల(Amaravathi farmers) నిరసన సెగ తగిలింది. మందడంలో గ్రామ సచివాలయం ప్రారంభానికి వెళ్తున్న శ్రీదేవిని లింగాయపాలెం సమీపంలో అమరావతి దళిత ఐకాస నేతలు అడ్డుకున్నారు. అసైన్డ్ రైతులకు ప్రభుత్వం నుంచి ఈ ఏడాది కౌలు డబ్బులు ఇంకా రాలేదని.. పెన్షన్లు కూడా చెల్లించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కాన్వాయ్కి అడ్డుగా రోడ్డుపై బైఠాయించారు.
వారిని పోలీసులు(police) బలవంతంగా పక్కకు నెట్టివేశారు. ఎమ్మెల్యేకు తమ సమస్యలు చెప్పుకుందామని వస్తే పోలీసులతో బల ప్రయోగం చేయించారని రైతులు వాపోయారు. అమరావతి ప్రజల సమస్యలు పరిష్కరించనప్పుడు ఆమె ఇక్కడకు రావాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. సమస్యలు పరిష్కరించకపోతే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
రాజధానిలో జరిగేది ఫొటో ఉద్యమమే: ఉండవల్లి శ్రీదేవి
సీఎం జగన్(cm jagan)తోనే రాజధాని అభివృద్ధి అని ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు. రాజధానిలో జరిగేది ఫొటో ఉద్యమమేనని విమర్శించారు. రైతులెవరూ సమస్యలపై తనను కలవలేదని.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. త్వరలోనే రాజధానిలో అభివృద్ధి(development) పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్సే పేర్కొన్నారు. రహదారిపై వినతిపత్రాలు ఇస్తే ఎలా అని ప్రశ్నించారు.
పోలీసుల తీరుపై విమర్శులు
గుంటూరు జిల్లా అమరావతిలో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని అడ్డుకున్న రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్న తీరు విమర్శలకు తావిస్తోంది. మందడంలో సచివాలయ ప్రారంభం కోసం వస్తున్న శ్రీదేవి వాహనశ్రేణికి... ఎస్సీ రైతు నేతలు అడ్డుపడ్డారు. వారిలో పులి చిన్నా అనే వ్యక్తిని తుళ్లూరు SI సురేశ్ అదుపులోకి తీసుకొని వాహనం ఎక్కించారు. ఆ కారుకు ఉన్న నంబర్ ప్లేట్‌పై YSR అని అక్షరాలున్నాయి. కాన్వాయ్‌లో ఎమ్మెల్యేకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు ప్రైవేటు వాహనంలో ఎందుకున్నారనేది ప్రశ్న. నంబర్ ప్లేట్‌పై ఉన్న ఫొటోలు చూస్తే అది వైకాపా నేతకు చెందిన వాహనమని తెలుస్తోంది. ఓ పార్టీ నాయకుల వాహనంలో అరెస్టు చేసిన వారిని ఎలా తీసుకెళ్తారనేది మరో ప్రశ్న. పైగా ఆ వాహనానికి సైరన్ కూడా ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రైవేటు వాహనాలకు సైరన్ ఉండకూడదు. ఇవన్నీ చూసిన ఐకాస నేతలు పోలీసులు నిబంధనలకు నీళ్లొదిలారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇదీ చదవండి: