అమరావతిలో జరుగుతున్న ఉద్యమాన్ని అమరావతి పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు భైరపునేని సూర్యనారాయణ పుస్తక రూపంలో తీసుకొచ్చారు. అమరావతి ఆక్రందన పేరుతో రాసిన ఈ పుస్తకాన్ని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు.. మందడంలో ఆవిష్కరించారు. మూడు రాజధానుల వల్ల అమరావతికి జరుగుతున్న నష్టాన్ని సవివరంగా ఈ పుస్తకంలో వివరించినట్టు రచయిత సూర్యనారాయణ చెప్పారు.
త్వరలో ఆంధ్రప్రదేశ్ ఆక్రందన
మూడు రాజధానుల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని... రైతులు చేస్తున్న ఉద్యమాన్ని స్పూర్తిగా తీసుకొని పుస్తకాన్ని రాశానని సూర్యనారాయణ తెలిపారు. త్వరలోనే మూడు రాజధానుల వల్ల రాష్ట్రానికి జరిగే నష్టాన్ని ఆంధ్రప్రదేశ్ ఆక్రందన పేరుతో మరో పుస్తకాన్ని విడుదల చేయబోతున్నామని రచయిత పేర్కొన్నారు.
అమరావతే ఏకైక రాజధాని
రాష్ట్రానికి రాజధానిగా అమరావతి కొనసాగుతోందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అభిప్రాయపడ్డారు. తుళ్లూరు మండలం మందడంలో రైతులు నిర్వహించిన దీక్షలో రాష్ట్ర హిందూ పరిరక్షణ సమితి అధ్యక్షుడు వెలగపూడి రామకృష్ణ ప్రసాద్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. అక్కడే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
హేతుబద్ధంగా లేని పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు న్యాయస్థానాల్లో నిలువవని వడ్డే శోభనాద్రీశ్వరరావు చెప్పారు. రాబోయే రోజుల్లో ఇతర సంఘాలను కలిపి అమరావతినే ఏకైక రాజధానిగా సాధించేందుకు పోరాటాలు చేస్తామని రాష్ట్ర హిందూ పరిరక్షణ సమితి అధ్యక్షుడు వెలగపూడి రామకృష్ణ ప్రసాద్ తెలిపారు.
ఇదీ చూడండి: