రాజధాని అమరావతి కోసం 34 వేల ఎకరాల మేర భూమిని 2015లో రాష్ట్ర ప్రభుత్వం సమీకరించింది. 29 వేల మందికి పైగా రైతులు తమ భూమిని ప్రభుత్వానికి అప్పగించారు. వీరిలో ఎకరంలోపు భూమి ఉన్నవారు 20 వేల మంది ఉన్నారు. ఎకరం నుంచి ఐదెకరాల వరకున్న వారు మరో 8,500 మంది ఉన్నారు. ప్రభుత్వం మెట్ట భూములకు ఎకరాకు రూ.30 వేలు, జరీబు భూమి ఎకరాకు రూ.50 వేల చొప్పున కౌలు నిర్ణయించింది. ఈ కౌలుని ఏటా పది శాతం పెంచుతోంది. 2015 నుంచి ప్రతి సంవత్సరం మే నెలలో రైతుల ఖాతాల్లో ప్రభుత్వం కౌలు జమ చేసేది.
బడ్జెట్ కేటాయింపులు చేసినా...
అయితే 2019లో సాధారణ ఎన్నికల వల్ల కొంత ఆలస్యమైంది. గతేడాది కూడా ఆగస్టులో కౌలు చెల్లించారు. ఈ ఏడాది రైతులకు సుమారు రూ.196 కోట్ల వరకు కౌలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. జూన్ నెల వచ్చినా రైతుల ఖాతాల్లో ఇంకా కౌలు సొమ్ము జమ కాలేదు. ఇటీవలి బడ్జెట్లో రాజధాని రైతుల కౌలుకు కేటాయింపులు జరిపారు. కానీ నిధులు మాత్రం విడుదల చేయలేదు. ప్రస్తుతం ఒక్కో రైతుకు ఎకరాకు 45 నుంచి 70 వేల రూపాయల వరకూ కౌలు రావాల్సి ఉంది. కౌలు వస్తేనే తమ కుటుంబ అవసరాలు తీరుతాయని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం తమకు వెంటనే కౌలు విడుదల చేయాలని కోరుతున్నారు.
దూరమైన ఉపాధి
భూమిని త్యాగం చేసిన రైతుల్లో ఎక్కువ మంది సన్న, చిన్నకారు రైతులే. అమరావతి నిర్మాణం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ఏదో ఒక పని దొరికేది. లేదా చిన్నా,చితకా వ్యాపారాలు చేసుకునేవారు. కౌలు డబ్బులతో పాటు ఇలా వివిధ మార్గాల్లో ఆదాయం వచ్చేది. కానీ అమరావతి నిర్మాణం ఆగిపోవటం, ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేయటంతో పరిస్థితి తారుమారైంది. ఉపాధి లేదు. వ్యాపారాలు దెబ్బతిన్నాయి. అదే సమయంలో కరోనా చుట్టుముట్టింది. దీంతో రైతులు ఆర్థికంగా కుదేలయ్యారు. సంక్షేమ పథకాలకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్న ప్రభుత్వం..చట్టబద్ధంగా తమకు రావాల్సిన కౌలుని ఆపటం సరికాదంటున్నారు. వెంటనే కౌలు సొమ్ము ఖాతాల్లో జమ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
కరోనా కారణంగా రెండు, మూడు నెలలుగా రైతుల నిరసనలు ఇళ్లకే పరిమితమయ్యాయి. మళ్లీ దీక్షా శిబిరాల్లో ఆందోళనలు ప్రారంభించేందుకు రైతులు సన్నాహాలు చేస్తున్నారు. కౌలు డబ్బులు రాకపోతే రోడ్డెక్కేందుకు సిద్ధమవుతున్నారు.
ఇదీచదవండి