అసంతృప్తి నేతల తిరుగుబాటు, అగ్రనేతల బుజ్జగింపులు, వివిధ వర్గాల ప్రజల్ని ఆకర్షించే ప్రయత్నాలతో విజయవాడ రాజకీయం వేసవి వేడిని తలపించింది. ఓవైపు అభ్యర్థుల గెలుపు కోసం వివిధ పార్టీల నేతలు ప్రచారాలు ముమ్మరం చేస్తే...., ఇంకోవైపై ప్రత్యర్థులను లొంగదీసుకునేందుకు ఎత్తులు పై ఎత్తులు అదేస్థాయిలో సాగుతున్నాయి. పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుతో కలిసి సినీనటుడు అలీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముస్లింల ఆత్మీయ సమావేశంలో ఎంపీ కేశినేని నాని పాల్గొన్నారు.
నందిగామలో వైకాపా, తెలుగుదేశం, భాజపా అభ్యర్థులు జోరుగా ప్రచారం చేశారు. అధికార పార్టీ అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే జగన్‌మోహన్‌రావు ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం అభ్యర్థుల తరఫున మాజీమంత్రి దేవినేని ఉమ ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. గుంటూరులో భాజపా అభ్యర్థుల తరఫున కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. వైకాపా పాలనలో ప్రజలు కట్టిన పన్నులు, కేంద్రం ఇచ్చే నిధులు ఎటు పోతున్నాయో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఆయన విమర్శించారు. 32వ డివిజన్‌లో మహిళా మోర్చా నాయకురాలు సాధినేని యామిని ప్రచారంలో పాల్గొన్నారు.
ఒంగోలులో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం ఉద్ధృతం చేసింది. మాజీ ఎమ్మెల్యే విజయ్‌కుమార్ ప్రచారం చేపట్టారు. పేర్నమాన్యాలు, సమతానగర్ ప్రాంతాల్లో పర్యటించారు. పేర్నమిట్టలో సీపీఐ అభ్యర్థిని విజయభారతి ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. అద్దంకిలో తెలుగుదేశం ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచాంలో పాల్గొన్నారు. పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. వైకాపా తరఫున ఆ పార్టీనేత బాచిన కృష్ణచైతన్య, చెంచు గరటయ్య ప్రచారంలో పాల్గొన్నారు. విశాఖ జీవీఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్ అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు 13వ వార్డులో సొంత అక్కాచెల్లెళ్లు ప్రత్యర్థులుగా బరిలో దిగారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో తెలుగుదేశం నాయకులు పితాని సత్యనారాయణ, తోట సీతారామలక్ష్మి, బండారు మాధవనాయుడు ప్రచారంలో పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో తెలుగుదేశం నేత నిమ్మకాయల చినరాజప్ప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు సైతం ప్రచారంలో పాల్గొన్నారు. జనసేన అభ్యర్థులు సైతం ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. విజయనగరంలో నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం సీనియర్ నేత అశోక్‌గజపతిరాజు పాల్గొన్నారు. రాజకీయ సన్యాసులతోనే రాష్ట్రం అథోగతి పాలైందని ఆయన విమర్శించారు.
రాయలసీమలో పురపాలక ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ప్రతి వార్డును రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. అనంతపురంలో మేయర్ అభ్యర్థి చవ్వా రాజేశేఖర్‌రెడ్డితో కలిసి వైకాపా ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. రాష్ట్రంలో ఇసుక, లిక్కర్ మాఫియాలే ప్రభుత్వాన్ని నడుపుతున్నాయన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తెలుగుదేశం నేత ఉమామహేశ్వరనాయుడు గడపగడపకు తిరిగారు. వైకాపా అభ్యర్థుల తరపున ఎమ్మెల్యే భర్త శ్రీచరణ్ పర్యటించారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి వార్డుల్లో పర్యటించి తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కోరారు. గుంతకల్లులో జేసీ పవన్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాయదుర్గంలో మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కదిరిలో మంత్రి శంకర్‌నారాయణ ప్రచారం నిర్వహించారు.
కర్నూలులో తెలుగుదేశం నేత కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి , టీజీ భరత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆదోనిలో తెలుగుదేశం నేత వెంకటరాముడు ప్రచారంలో పాల్గొన్నారు బండిమిట్ట , ఎంఎం కాలనీలో పార్టీ అభ్యర్థుల తరపున ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగారు. కడపలో భాజపా అభ్యర్థుల తరపున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగారు.
ఇదీచదవండి.