త్వరలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్లో అగ్రిగోల్డ్ బాధితులకు నిధులు కేటాయించాలని అగ్రిగోల్డ్ ఖాతాదారులు, ఏజెంట్ల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. గుంటూరు జిల్లా సీపీఐ కార్యాలయంలో సంఘం గౌరవాధ్యక్షుడు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ బాధితులు ధర్నా నిర్వహించారు. సంక్షేమ పథకాల కోసం 80వేల కోట్ల వరకు అప్పులు చేసిన ప్రభుత్వం... 20 లక్షల మంది బాధితుల సమస్యను పట్టించుకోవడం లేదని నాగేశ్వరరావు ఆరోపించారు.
అధికారంలోకి వచ్చాక మూడు మాసాల్లో 20వేల రూపాయల లోపు డిపాజిటర్లకు సొమ్ము చెల్లిస్తామని సీఎం ఇచ్చిన హామీని నేరవేర్చాలని కోరారు. మిగిలిన వారికి వీలైనంత త్వరగా డబ్బులు చెల్లిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చారన్నారు. ఇప్పటివరకు 400 మంది అగ్రిగోల్డ్ బాధితులు చనిపోయారని తెలిపారు. వారికి పది లక్షల చొప్పున పరిహారం ఇస్తానని ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ సమస్యను పదో రత్నంగా భావించి..... బడ్జెట్లో 4వేల కోట్ల రూపాయలు కేటాయించాలని నాగేశ్వరరావు కోరారు.
ఇదీ చదవండి: పోలీసుల సంక్షేమానికి రూ. 5 లక్షల విరాళం