According to NCRB Statistics Suicides Increasing: ఇంట్లో తల్లిదండ్రులు ఫోన్ ఇవ్వలేదని ఒకరు.. మానసిక, కుటుంబ సమస్యలతో మరొకరు.. విద్యా, వ్యాపారం ఇలా వివిధ కారణాలతో తనువు చాలించే వారి సంఖ్య పెరిగిపోతోంది. సమస్యలను ఎదుర్కోలేక జీవితాలకు ముగింపు పలుకుతున్నారు. ఫలితంగా కుటుంబ సభ్యులకు వేదనే మిగులుతోంది. సమస్య ఏదైనా పరిష్కార మార్గాలను గుర్తించి సకాలంలో స్పందించాలని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం అనారోగ్యం కారణంగా విజయవాడ నగరంలో గత ఏడాది 119 మంది తనువు చాలించారు. దీర్ఘకాలిక అనారోగ్య ఇబ్బందులు తాళలేక మరో 89 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక సమస్యలు, వ్యాపారాలు దివాళా తీయడం, అప్పులు ఈ క్రమంలో మరణించే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.
Suicides రాష్ట్రంలో ఆత్మహత్యలు పెరిగాయి.. కారణాలివే!
ప్రేమ వ్యవహారాల కారణంగా 19 మంది యువత బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిలో 12 యువకులు, ఏడుగురు యువతులు ఉన్నారు. ప్రేమ విఫలం కావడం, పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించడం లేదన్న కారణంతో తనువు చాలిస్తున్నారు. ఆడుకునేందుకు ఫోన్ ఇవ్వలేదని విజయవాడకు చెందిన ఓ బాలుడు ఆత్మహత్యాయత్నకు యత్నించాడు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లకు బానిసలుగా మారి చిన్నారులు భవిష్యత్‌ను కోల్పోతున్నారని వైద్యులు చెబుతున్నారు.
కొరియర్ బాయ్‌గా పనిచేసే నందిగామ పట్టణానికి చెందిన పవన్ ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలుసుకుని నిలదీశాడు. తనను మర్చిపోవాలని ఆమె సూచించింది. దీంతో తీవ్ర ఆవేదనకు లోనైన యువకుడు ఇంటికి వెళ్లి పురుగుల మందు తాగి చనిపోయాడు.
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో రోజుకు సగటున ఐదుగురు వరకు వివిధ కారణాలతో ప్రాణాలు తీసుకుంటున్నారు. అయితే వాటిల్లో పూర్తిస్థాయిలో రికార్డుల్లో నమోదు కానివి.. ఇందుకు రెండింతలు ఉంటున్నాయంటున్నారు. సమస్యలు ఎదురైనప్పుడు వ్యక్తిలోని క్షణికావేశం ఆత్మహత్యలకు దారితీస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. సమస్యలను ఎదుర్కోలేకనే మానసికంగా కుంగిపోయి.. జీవితాలను అంతం చేసుకుంటున్నారని నిపుణులు వివరిస్తున్నారు. దీనివల్ల వారి కుటుంబాల్లో తీరని శోకం మిగులుతోందని అంటున్నారు.
సమస్య ఎదురైనప్పుడు తీవ్ర ఒత్తిడికి లోనై సరైన నిర్ణయం తీసుకోలేక బలవన్మరణానికి పాల్పడుతున్నారన్నారు. వీరిలో యువతీ, యువకులే ఎక్కువ సంఖ్యలో ఉండడం ఆందోళన కలిగించే అంశంగా కనపడుతోంది. ఆత్మహత్య చేసుకునే వారి లక్షణాలు ముందే కనపడతాయని వైద్యులు చెబుతున్నారు. వారిని గమనించి ఓదారిస్తే ఆత్మహత్యల తీవ్రతను నివారించవచ్చని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకు కుటుంబ సభ్యులు తోటి మిత్రుల సహాయం ఎంతగానో సహాయ పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
Lovers Suicide: ప్రియురాలికి పెళ్లి కుదిరిందని.. ప్రేమజంట ఆత్మహత్య