తనపై వైకాపా నాయకుడు మిట్టపల్లి రమేష్ దౌర్జన్యం చేశాడని గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన ఎంవీఎస్ గుప్తా ఆరోపించారు. రమేష్ కు చెందిన మిల్లును తాను 2008లో లీజుకు తీసుకున్నానని.. సొంతంగా యంత్రాలు బిగించుకుని వ్యాపారం చేసుకుంటున్నానని చెప్పారు. లీజు గడువు ముగియగా.. మరి కొంత కాలం ఇవ్వాలని తాను చేసిన విజ్ఞప్తికి రమేష్ అంగీకరించినట్టు తెలిపారు. కానీ.. తనకు తెలియకుండా.. ఉన్న ఫళంగా యంత్రాలు తరలించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తాను ఊరిలో లేనప్పుడు ఇలా చేశారని ఆవేదన చెందారు. వేరొకరికి మిల్లును విక్రయించినట్టు తెలియగా.. గుంటూరు రూరల్ ఎస్పీ, ఐజీ, డీజీపీ, ముఖ్యమంత్రి కార్యాలయాలలో ఫిర్యాదు చేశానన్నారు. తనకు న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించగా ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చినా... కోర్టు ఆదేశాలను ధిక్కరించి మిల్లులోని సామగ్రిని తరలించేయత్నం చేశారని వాపోయారు.
ఈ విషయమై వైకాపా నేత మిట్టపల్లి రమేష్‌ను వివరణ కోరగా.. గుప్తాకు ఇచ్చిన లీజు గడువు ముగిసిందన్నారు. యంత్రాలతో అతనికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఆ పత్రాలు కూడా శిక్షణ డీఎస్పీకి అందజేశానని చెప్పారు.
ఈ విషయమై శిక్షణ డీఎస్పీ మాధవరెడ్డిని వివరణ కోరగా ఇరువురి వాదనలు విన్నానన్నారు. డాక్యుమెంట్లను పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇదీ చూడండి: