వికేంద్రీకరణతోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని వైకాపా నేతలు అన్నారు. గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలోని నెహ్రు బొమ్మ సెంటర్ వద్ద వైకాపా ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ర్యాలీగా వచ్చి బస్టాండ్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పలువురు వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు పూలమాలలు వేశారు. కార్యక్రమంలో మంత్రులు మోపిదేవి వెంకట రమణ, మేకతోటి సుచరిత, నారాయణ స్వామి, బాపట్ల ఎంపీ నందిగాం సురేశ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తాము పోరాడుతుంటే... తెదేపా నేతలు విమర్శలు చేయడం సరికాదని మండిపడ్డారు. తెదేపా పాలనలో తాత్కాలిక నిర్మాణాలతో ప్రజా ధనాన్ని వృథా చేశారని వారు ఆరోపించారు. బినామీల పేరుతో అమరావతిలో వందల ఎకరాల భూములను తెదేపా నేతలు కొనుగోలు చేశారని... వికేంద్రీకరణ జరిగితే తమ భూములకు ఖరీదు రాదనే ఉద్దేశంతోనే ప్రజలను మభ్యపెట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ కష్టపడుతున్నారని.. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. వికేంద్రీకరణతో అమరావతిలోని ప్రజలకు ఎలాంటి నష్టం జరగదన్నారు.
ఇవీ చదవండి...బిల్లులకు మండలిలో ఆమోదం లభించేనా?