కాస్త వయసు పైన బడితేనే... ఆయాసంతో హమ్మా అంటాం. నడుం పనిచేయట్లేదని.. ఎప్పుడూ గొనుక్కోవడం. 75 ఏళ్ల వయస్సైతే... కృష్ణా... రామా అంటూ కుర్చుంటాం. కానీ ఈయన మాత్రం.. నీటిపై నిశ్చలంగా.. కాళ్లు చేతుల కదపకుండా ఉంటారు. నీటిపై శవాసనమేయడం ఆయన ప్రత్యేకత.
గుంటూరు జిల్లా ఈపూరు మండలం ఊడిజర్ల గ్రామానికి చెందిన కోటిరెడ్డి వయస్సు 75 ఏళ్లు. ఆయన వయసు చెబితేనే... అవునా అంత వయస్సుంటుందా అనిపిస్తోంది. కుర్రాళ్లకు ఏమాత్రం తీసిపోకుండా ఆయన వేస్తున్న ఆసనాలు అందరిదృష్టినీ ఆకర్షిస్తున్నాయి. సాగర్ కాల్వలో.. రోజుకు కొన్ని గంటలపాటు కోటిరెడ్డి... ఆసనాలు వేస్తూ అబ్బురపరుస్తున్నాడు. శాస్త్రీయంగా ఏ ఆసనం ఎందుకో తెలియదు గానీ... నీటిలో ఎలా వేయమంటే అలా ఆసనాలు వేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.
రోజంతా వ్యవసాయ పనులు చేసే కోటిరెడ్డి లాంటి వృద్ధ రైతు...నీటిపై అనేక ఆసనాలు వేస్తున్నాడు. ఈత కొట్టడమంటే అతనికున్న సరదానే ఇలా తీర్చిదిద్దింది. గ్రామం పక్కనే ఉన్న సాగర్ కుడి కాలువలోకి రోజూ ఈతకు వెళ్తాడు. నీటిలో ఎంతసేపైనా ఉంటాడు. కోటిరెడ్డి కాలువలో కాళ్లు చేతులు కదిలించకుండా ఉంటే... కొందరు శవం అనుకుని భయపడిన ఘటనలూ ఉన్నాయి. సులభంగా ఈదుతూ... ఆసనాలు వేస్తూ... ఈతంటే ఇంత సులువా అనే భావన కలిగిస్తున్నాడు.
ఈత అందరికీ అవసరమని ఈ పెద్దాయన చెప్పకనే చెబుతున్నాడు. చిన్నపుడు రొంపిచర్ల మండలం బుచ్చిపాపన్నపాలెం గ్రామానికి చెందిన పమ్మి ముసలారెడ్డి వద్ద ఈ విద్యను నేర్చుకున్నాడట కోటిరెడ్డి.
ఇదీ చదవండి:భాజపా బలపడుతోంది... అందుకే...!