బాలకార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్‌ను చేపట్టారు. పుస్తకాలు పట్టి బడికి వెళ్లాల్సిన వయస్సులో బాల కార్మికులుగా మారుతున్న వారిని గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా 693 బృందాలు ఏర్పాటు చేసి హోటళ్లు ,రెస్టారెంట్స్, గృహాలు, షాపుల్లో తనిఖీలు చేపట్టారని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. కార్మికులుగా పనిచేస్తున్న 1371 బాలలను గుర్తించారు. వీరిలో 1192 మంది బాలురు,179 బాలికలు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 286 మంది బాలలను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. మిగిలిన వారిని ఛైల్డ్ రెస్క్యూ హోమ్‌కు తరలించారు. చాలా మంది పిల్లలు వీధుల్లో తిరుగుతూ... చెడుదారి పడుతున్నారని డీజీపీ ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలను బడికి పంపాలని లేకుంటే తల్లిదండ్రులపై చర్యలు తప్పవని డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు 70 మంది చిన్నారులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారున్నారని గుర్తించారు. చిన్నారుల నుంచి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. చిరునామా తెలుసుకుని వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు.
ఛైల్డ్ వెల్ఫేర్, పోలీసులు, కార్మికశాఖ అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ ముస్కాన్ చేపట్టారు. తెల్లవారు జామున 4 గంటల నుంచి సాయంత్రం వరకు తనిఖీలు చేపట్టారు.