ఏలూరు జిల్లా నూజివీడు పరిధిలో కొత్త రావిచర్లకు చెందిన కలపాల కిరణ్‌కుమార్(28) మృతి శుక్రవారం కలకలం రేపింది. విచారణ పేరుతో పిలిపించిన పోలీసులు మానసికంగా హింసించటంతోనే కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఒక వివాహితతో కిరణ్‌కుమార్ చనువుగా ఉంటున్నాడని సీఐ వద్ద పనిచేస్తున్న డ్రైవర్ హోంగార్డు రమేష్.. అతడిని స్టేషన్‌కు పిలిపించి ఇబ్బందులకు గురిచేసినట్లు చెబుతున్నారు. రమేష్ సదరు మహిళకు బంధువు. వేధింపులతో మనస్తాపం చెందిన కిరణ్‌కుమార్ గురువారం పురుగులమందు తాగి ఆత్మహత్యయత్నం చేశాడు. బంధువులు, పోలీసులు అతన్ని చికిత్స నిమిత్తం నూజివీడులోని జీఎంహెచ్‌కి తరలించారు. మెరుగైన చికిత్స కోసం గన్నవరంలోని పిన్నమనేని సిద్దార్థ వైద్యకళాశాలకు తరలించగా అక్కడ మృతిచెందాడు. అక్కడి నుంచి శవపరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న.. మృతదేహం తమకు ఎందుకు అప్పగించట్లేదని అతడి బంధువులు గన్నవరంలో ఆందోళనకు దిగారు. నూజివీడు పోలీసులు ఆసుపత్రికి చేరుకొని పోస్టుమార్టం చేయించి మృతదేహాన్ని అప్పగించడంతో వివాదం సద్దుమణిగింది. కిరణ్‌ను వేధించిన పోలీసులపై చర్యలు తీసుకోవడంతో పాటు సీఐ డ్రైవర్ కొలకలూరి రమేష్‌తో పాటు సదరు మహిళ భర్త, అత్తలపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. మృతుడి బంధువుల ఆరోపణల్లో వాస్తవం లేదని, పోస్టుమార్టం వివరాలు సేకరించేందుకు నూజివీడు నుంచి రావడంలో కొంత ఆలస్యమైందని పోలీసులు వివరించారు.
విచారణ చేస్తాం: ‘గ్రామంలోని ఒక మహిళతో కిరణ్‌కుమార్‌కు వివాహేతర సంబంధం ఉంది. గ్రామంలోని కులపెద్దలు పలుసార్లు చెప్పినా కొనసాగిస్తున్నాడు. సీఐ డ్రైవర్ బెదిరించడంతో 17న పురుగుమందు తాగి తన అన్నకు ఫోన్ చేసి చెప్పాడు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నాం’ అని నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు తెలిపారు.
ఇవి చదవండి: వివాహిత ప్రేమను తిరస్కరించిందని గొంతు కోసుకున్న యువకుడు, పరిస్థితి విషమం