1000 Years Old Chennakesava Swamy Galigopuram: ఏలూరు నగరానికి 3 కిలోమీటర్ల దూరంలో శనివారపుపేట ఉంది. అక్కడికి చేరుకోగానే.. ఎడమవైపున ఎత్తైన గాలి గోపురం ఉంటుంది. పాదచారులతో పాటు వాహనదారులను విశేషంగా ఆకట్టుకుంటుంది. 100 అడుగుల ఎత్తులో.. నాలుగు అంతస్తులుగా ఉంటూ అశేష శిల్పకళా సంపదతో కనువిందు చేస్తోంది. దీని నిర్మాణం 11వ శతాబ్దం.. చాళుక్యుల కాలంలో జరిగినట్లుగా పురావస్తు శాఖ అధికారులు ధ్రువీకరించారు. గోపురంపై ఆనాటి చాళుక్య రాజుల సంస్కృతి, సంప్రదాయాలతో పాటు.. రామాయణం, శ్రీరామపట్టాభిషేకం, మహాభారతం, భాగవతం లాంటి పురాణ, ఇతిహాసాలు.. క్షీరసాగర మథనం, యక్షులు, గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు, ఆళ్వార్లు, ఋషులు, మునులు, వాత్సాయన కామసూత్రకు సంబంధించిన శిల్పాలను శాస్త్రీయ విధానంలో ప్రాచీన వైభవానికి సంకేతంగా నిర్మించారు.
పూర్తిగా ఇసుక రాతి శిలతో నిర్మితమైన ఈ గాలి గోపురం కొన్నేళ్ల క్రితమే శిథిలావస్థకు చేరుకోగా.. 2004లో గోపురం మీదున్న శిలాసంపదను తొలగించి పునర్నిర్మాణానికి చర్యలు చేపట్టారు. నగరానికి చెందిన సామాజిక కార్యకర్త అయ్యంగార్ చొరవతో.. అనేక పోరాటాల తర్వాత గోపురం వైభవం దెబ్బతినకుండా.. పాడైన వాటిని మాత్రమే తొలగించారు. వాటి స్థానంలో సున్నం, బెల్లం, కరక్కాయ, జనపనార పొట్టు, తుమ్మ జిగురు మిశ్రమాల్ని ఉపయోగించి శిలాసంపదను తిరిగి రూపొందించారు. ఐఐటీ చెన్నై, వరంగల్ నిట్ ప్రొఫెసర్లు, రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులు గాలిగోపురం పునర్నిర్మాణ విషయంలో పలు సలహాలు, సూచనలు అందించారు. చాళుక్యు రాజుల కాలంలో గోపురం నిర్మితమైనప్పటికీ.. తర్వాతి కాలంలో అప్పటి జమీందార్లు మేకా ధర్మ అప్పారావు ఆలయానికి పోషకులుగా ఉన్నట్లు ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది. ఘన చరిత్ర కలిగిన ఈ గోపురం 2004లో పునర్నిర్మాణం చేసుకోగా.. ప్రస్తుతం అక్కడక్కడా పిచ్చి మొక్కలు మొలిచి.. ఆలనా పాలనకు దూరంగా ఉంటుంది.
ద్వారకా తిరుమల దత్తత ఆలయంగా ఉన్న ఈ శివ కేశవ క్షేత్రం.. ప్రస్తుతం దేవాదాయశాఖ పరిధిలో ఉంది. అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు.. రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తోంది. ప్రాచీన వైభవానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ గోపురం.. మరో 400 ఏళ్లు పటిష్ఠంగా ఉండాలంటే.. ఆలయం ముందున్న రహదారిపై భారీ వాహనాల రాకపోకలను నివారించాలని 2013-14లో ప్రొఫెసర్లు నివేదిక ఇచ్చారు. నేటికీ అది అమలుకు నోచుకోవడం లేదు. ప్రభుత్వం, పురావస్తు శాఖ అధికారులు స్పందించి.. చాళుక్య రాజుల కాలం నాటి ఈ ప్రాచీన గోపురం వైభవాన్ని.. భవిష్యత్ తరాలకు తెలిసేలా చర్యలు తీసుకోవాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.
"చాళుక్యుల కాలంలో నిర్మాణమైనట్టు చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. 2014లో దీనిని పునర్నిర్మాణం చేశారు. ఆలయం ముందున్న రహదారిపై భారీ వాహనాలను నివారించి.. ఆలయ రక్షణకు ప్రభుత్వం, పురావస్తు శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం". - బి.కె.ఎస్.ఆర్. అయ్యంగార్, సామాజికవేత్త
ఇవీ చదవండి: