Eluru News: ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో ఓ ఫేస్ బుక్ పోస్ట.. వైకాపా, తెలుగుదేశం పార్టీల మధ్య వివాదానికి కారణమైంది. దెందులూరు మండలం శ్రీరామవరానికి చెందిన ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో మరో వ్యక్తిని కించపరుస్తూ పోస్టు పెట్టారు. దీన్ని జీర్ణించుకోలేని ప్రత్యర్థులు పోస్టు పెట్టిన వ్యక్తిపై దాడికి కుట్ర పన్నారు. దీంతో దెందులూరు పోలీసులు నిందితుడిని ముందే స్టేషన్‌కు తరలించారు. సమాచారం అందుకున్న తెలుగుదేశం, వైకాపా నాయకులు స్టేషన్ వద్దకు భారీగా చేరుకొని బాహాబాహీకి దిగారు. కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. వీరిని అదుపు చేసే క్రమంలో ఎస్సై వీర్రాజుకు గాయాలయ్యాయి.
పరిస్థితులు చేయి దాటుతుండటంతో రంగంలోకి దిగిన పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బలగాలను తరలించారు. ఇరు వర్గాలను స్టేషన్ నుంచి బయటకు పంపించేశారు. ఈ క్రమంలో వైకాపా శ్రేణులు వచ్చి తమ ఇంటిపై దాడికి పాల్పడినట్లు TNSF అధ్యక్షుడు మహేష్ యాదవ్ ఆరోపించారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమైనట్లు వివరించారు. మరోవైపు శ్రీరామవరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక బలగాలను మోహరించారు.