National Award To Woman Sarpanch : నీటి సంరక్షణ ప్రాధాన్యాన్ని ఆ మహిళా సర్పంచ్ గుర్తించారు. జలవనరులను ఒడిసి పట్టడం అత్యంత ముఖ్యమని భావించారు. అందుకోసం ఉపాధి హామీ పనులను ఉపయోగించుకున్నారు. వర్షపు నీటి సేకరణ, సంరక్షణ పనులను చేపట్టారు. తన పనితనానికి గుర్తింపుగా జలశక్తి అభియాన్ పథకంలో భాగంగా జాతీయస్థాయి అవార్డు అందుకున్నారు. లక్ష్యాన్ని ఎంచుకుని ప్రణాళికాబద్ధంగా ఊరిని అభివృద్ధి చేస్తున్న ఆ సర్పంచ్‌పై.. మహిళా దినోత్సవ వేళ ప్రత్యేక కథనం
ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం పంచాయతీ సర్పంచ్‌గా తెల్లం వెంకాయమ్మ పనిచేస్తున్నారు. ఆమె గిరిజన మహిళ. మెట్ట ప్రాంత వాసి కావడంతో.. నీటి విలువ ఏంటో వెంకాయమ్మకు బాగా తెలుసు. అందుకే సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి గ్రామస్థుల సహకారంతో జల సంరక్షణ కోసం అనేక పనులను చేపట్టారు వెంకాయమ్మ. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో భాగంగా పిచ్చి మొక్కలు, చెత్త తొలగింపు లాంటి చర్యలను చేపట్టారు. చెరువుల తవ్వకం, ఇంకుడు గుంతలు, చెక్ డ్యాంలు నిర్మించడం, పంట కాలువల్లో పూడిక తీయించడం వంటి పనుల ద్వారా వర్షాకాలంలో నీరు చెరువుల్లోకి చేరేలా చర్యలు చేపట్టారు. గ్రామ ప్రజల భాగస్వామ్యంతో 5 నీటి పారుదల పునరుద్ధరణ పనులను సుమారు 10 లక్షల క్యూబిక్ మీటర్ల నిల్వ సామర్థ్యంతో పూర్తిచేశారు. సుమారు కోటీ 30 లక్షల రూపాయలతో.. వాటర్ షెడ్‌లను నిర్మించారు. తాగునీటి ట్యాంకుల్లో పూడికతీక పనులు చేయించారు. పశువుల దాహం తీర్చేందుకు 6 చెరువుల్ని బాగుచేయించారు. వీటితోపాటు 2 చెక్‌డ్యాంలను పూర్తిచేశారు. ఇలా రైతులు, స్థానికుల భాగస్వామ్యంతో 8 చెరువులు కొత్తరూపు సంతరించుకున్నాయి.
గత మూడేళ్లుగా ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకుంటూ.. వర్షపు నీటి సేకరణ సంరక్షణ పనులు చేపట్టినందుకు ఆమె జాతీయస్థాయి పురస్కారం అందుకున్నారు. ఆమె సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. స్వచ్ఛ శక్తి సమ్మాన్-2023, ఉమెన్ లీడర్‌షిప్ పేరుతో ఈ నెల 4వ తేదీన దిల్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో.. వెంకాయమ్మ, కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
జల్‌శక్తి అభియాన్‌లో ఆదర్శవంతమైన పనితీరు, విశిష్ట సహకారాన్ని అందించడంతోపాటు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని.. ఈ అవార్డును వెంకాయమ్మ సొంతం చేసుకున్నారు. స్వచ్ఛభారత్, జలజీవన్ మిషన్, జలశక్తి అభియాన్ రంగాల్లో కృషి చేసిన వారిలో దేశవ్యాప్తంగా 36 మందికి ఈ పురస్కారాలు ప్రదానం చేయగా.. మన రాష్ట్రం నుంచి ఈ అవార్డు బుట్టాయిగూడెం పంచాయతీకి దక్కింది. ఈ అవార్డు మరింత బాధ్యతను పెంచిందన్న సర్పంచ్ వెంకాయమ్మ అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజల భాగస్వామ్యంతో మరిన్ని గ్రామాభివృద్ధి పనులు చేపడతానని చెబుతున్నారు.
"జాతీయ అవార్డు అందుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. చెక్ డ్యాంల నిర్మాణం, చెరువులలో పూటిక తీయించాను. పంటకాలువలు తీయించాను. జవ జీవన్ మిషన్‌ను గ్రామంలో ముందుకు తీసుకువెళ్తాను. గ్రామ పంచాయతీ నుంచి ఈ గిరిజన ప్రాంతాన్ని అభివృద్ది చేసేందుకే పనిచేస్తాను." - తెల్లం వెంకాయమ్మ, బుట్టాయిగూడెం సర్పంచ్
గ్రామానికి జాతీయస్థాయి పురస్కారం దక్కడం పట్ల బుట్టాయిగూడెం ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జల సంరక్షణ చర్యల వల్ల సత్ఫలితాలను అనుభవిస్తున్నామని అంటున్నారు. బుట్టాయిగూడెం పంచాయతీ అభివృద్ధి నమూనాతో మిగతా గ్రామాలనూ ప్రగతి పథంలో నడుపుతామని ఏలూరు జిల్లా అధికారులు చెబుతున్నారు.
"గ్రామంలో జలజీవన్ మిషన్ కార్యక్రమం కింద చెక్ డ్యాంలు నిర్మించారు. దీని వల్ల గ్రామంలో భూగర్భ జలాలు పెరిగాయి. స్థానికంగా ఉన్న బోర్లు, బావులలో నీళ్లు సవృద్ధిగా ఉన్నాయి. ప్రతి ఇంటికి నీటి కుళాయిలు ఏర్పాటు చేశారు. మంచినీటి కోసం గ్రామంలో బోర్లు వేశారు. గ్రామానికి అవసరమైన పనులకు మా వంతు కృషి చేస్తాము." -దేవరాజు, బుట్టాయిగూడెం
"ఊరిలో నీటి కుంటలు ఏర్పాటు చేశారు. దీనివల్ల పంట పోలాలకు సాగునీరు అందుతోంది. గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన దగ్గర నుంచి మహత్మ గాంధీ జాతీయ గ్రామీణ పథకాన్ని ఉపయోగించి ఎన్నో కార్యక్రమాలు చేశారు. మా గ్రామ సర్పంచ్ జాతీయ స్థాయి అవార్డు అందుకోవటం మాకు గొప్పగా ఉంది." -రమేశ్, బుట్టాయిగూడెం
ఇవీ చదవండి :