Tension at Polavaram: పోలవరం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రాజెక్టు సందర్శనకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు వెళ్లగా.. పోలీసులు అనుమతి నిరాకరించారు. ప్రాజెక్టు సందర్శనకు ఎందుకు వెళ్లనీయరని పోలీసులను ప్రశ్నించిన చంద్రబాబు... కాసేపు వాగ్వాదం తర్వాత అక్కడే రోడ్డుపై బైఠాయించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో రెండోరోజు పర్యటిస్తున్న చంద్రబాబు.. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లగా.. పోలీసులు అడ్డుకున్నారు. ప్రాజెక్టు పరిశీలనకు అనుమతి లేదంటూ చంద్రబాబును పోలీసులు నిలువరించారు. రహదారికి అడ్డంగా బారికేడ్లతో పాటు ముందుకు వెళ్లకుండా వాహనాలను అడ్డుగా పెట్టారు. దీంతో చంద్రబాబు.. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యటనకు ఎందుకు అనుమతి ఇవ్వరంటూ పోలీసులను నిలదీశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు తాను ప్రారంభించి, సగానికి పైగా పనులు పూర్తిచేసిన ప్రాజెక్టు వద్దకు తననే వెళ్లనీయరా అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం సందర్శనకు పైఅధికారులతో మాట్లాడి త్వరలో అనుమతిస్తామన్న పోలీసుల హామీతో నిరసన విరమించి బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. తర్వాత మాట్లాడిన చంద్రబాబు.. ప్రభుత్వంతో పాటు సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
పోలవరం సందర్శన కోసం రోడ్డుపై నిరసన తెలపాల్సి రావడం ఇదేం ఖర్మ రాష్ట్రానికి.. పోలవరం రివర్స్ టెండరింగ్ వద్దని మొత్తుకున్నా సైకో వినలేదు.. 5కోట్ల మంది ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు.. 73శాతం పోలవరం పనులు పూర్తి చేసిన నాకు సందర్శన అనుమతి లేదా.. పోలవరం సందర్శన నాకు కొత్త కాదు.. 28సార్లు పోలవరం వచ్చా, సోమవారాన్ని పోలవరంగా మార్చుకుని ముందుకు పోయా.. పోలవరం కోసం నిర్వాసితుల త్యాగాలు వెలకట్టలేం.. నా జీవితంలో పోలవరం ముంపు గ్రామాలను, ప్రజలను మర్చిపోలేను.. ఎంత ఖర్చయినా పునరావాస కాలనీలు నిర్మించాలని అనుకున్నా.. అధికారంలోకి రాగానే పోలవరంను ప్రత్యేక జిల్లాగా ప్రకటించి అన్ని సమస్యలు పరిష్కరిస్తా.. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న సీఎం, యువతకో గంజాయి ఇచ్చి మత్తులో ముంచుతున్నాడు. -చంద్రబాబు